Publish Date: Sat, 12 Sep 2015 (16:13 IST)
Updated Date: Sat, 12 Sep 2015 (16:16 IST)
భాద్రపద శుద్ధచవితి రోజున వచ్చే వినాయక చవితి నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేవాలి. శుచిగా అభ్యంగన స్నానమాచరించి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో రంగ వల్లికలతో అలంకరించుకోవాలి. ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు ధరించి.. పూజకు ఉపయోగపడే వస్తువులు, పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి.
ఆకుపచ్చ రంగు వస్త్రమును కప్పిన కలశమును, వినాయకుడి ఫోటో లేదా శ్వేతార్క గణపతి ప్రతిమను పూజకు సిద్ధం చేసుకోవాలి. పసుపురంగు అక్షతలు, కలువ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వుల మాలతో గణపతిని అలంకరించుకోవాలి. నైవేద్యానికి ఉండ్రాళ్ళు, బూరెలు, గారెలు, వెలక్కాయ వంటివి తయారు చేసుకోవాలి. దీపారాధనకు రెంచు కంచు దీపాల్లో ఏడు జిల్లేడు వత్తులను ఉంచి, కొబ్బరినూనెతో దీపమెలిగించాలి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపు పూజను పూర్తి చేయాలి.
చతుర్థినాడు మట్టితో తయారు చేసిన బొమ్మను పూజలో ఉంచడం శ్రేష్ఠం. కర్పూర హారతులను సమర్పించేందుకు ముందు గణపతి అష్టోత్తరము, ఋణవిమోచక గణపతి స్తోత్రమ్, గణపతి సహస్రనామం, శ్రీ గణేశారాధనలతో స్తుతించడం లేదా “ఓం గం గణపతయే నమః” అనే మంత్రమును 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో పంచహారతులివ్వడమో, లేదా కర్పూర హారతులు సమర్పించుకోవాలి.
ఇకపోతే.. ఇంట్లో పూజకోసం ఉంచిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేవరకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి, హారతి ఇస్తుండాలి. పూజ పూర్తయ్యాక అక్షతలు జల్లి, విగ్రహాన్ని కదిలించాలి. తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి.
వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టిపాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి.
వినాయక చతుర్థి నాడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని, అయినవల్లి విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం. అలా కుదరని పక్షంలో సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. అలాగే ఆలయాల్లో 108 ఉండ్రాళ్లతో పూజ, గణపతి ధ్యానశ్లోకం, గరికెతో గణపతి గకార అష్టోత్తరం, గణేశ నవరాత్రి ఉత్సవములు నిర్వహిస్తే వంశాభివృద్ధి, సకలసంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
అలాగే మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు గణపతి స్తోత్రమాల, గరికెతో గణపతి పూజ, శ్రీ గణేశారాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు.