ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశ చతుర్థి ప్రారంభమై.. అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. ఈ సంవత్సరం చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27 మధ్యాహ్నం 03:44 గంటలకు ముగుస్తుంది. పది రోజుల పాటు జరిగే ఈ గణేశ ఉత్సవం కోసం ప్రజలు చాలా రోజుల ముందు నుంచే ఉత్సాహంగా ఎదురుచూస్తారు.
ఇంట్లో ప్రతిష్టించే గణేశ విగ్రహం ఎక్కడా దెబ్బతిన్నది కాకూడదు. విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం లేదా పూజించడం శుభప్రదం కాదు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను ఎంచుకోవాలి, ఎందుకంటే అవి పర్యావరణానికీ మంచివి. గణపతి పూజలో తులసి ఉపయోగించడం నిషేధం.
పురాణాల ప్రకారం తులసి, గణేశుడి వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆయన ఆమెను శపించాడు. అందుకే గణపతి పూజలో దర్భ గడ్డిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.
గణేష్ పూజ సమయంలో నలుపు లేదా నీలం రంగు దుస్తులను అశుభంగా పరిగణిస్తారు. ఈ రోజున పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులు ధరించడం శుభప్రదం. ఇవి సానుకూల శక్తి, ఆనందాన్ని సూచిస్తాయి.