పూర్వకాలంలో ఋషులను రాక్షసులు బాధపెడుతున్నప్పుడు వారందరూ కలిసి పరమేశ్వరుడిని దర్శించి తమ బాధను విన్నవించుకున్నారు. అప్పుడు పరమ శివుడు అందుకు ఉపాయం ఆలోచిస్తూ తల ఎత్తాడట. ఎదురుగా వున్న పార్వతిని చూసి శివుడు జలానికీ, పృథివికీ రూపాలున్నాయి. ఆకాశానికి లేదేంటి? అని ప్రశ్నించారట.
అందుకు ఆకాశమే పుత్రరూపంతో వారి ఎదుట గోచరించిందట. అతని అందాన్ని చూసి పార్వతి మనసు కూడా వికలమైనదట. ఆ బాలుడు దేవకామినుల మనసును కూడా చలింపజేసాడట. అందువల్ల ఆ బిడ్డ మీద కోపమొచ్చిందట.
నీవు ఏనుగు తల, బొజ్జకడుపు కలవాడవు కమ్ము. పాములు నీకు జన్నిదాలవుతాయి అని శపించాడట. అతడే విఘ్నేశ్వరుడు, వినాయకుడు అని పిలువబడ్డాడు. అతని శరీరం నుండి ఎందరో గజముఖులు పుట్టారట. వారే అతని పరివారమయ్యారు. అది చూసి శివుడు ప్రతి కార్యానికి ముందుగా వినాయకుడు పూజింపబడతాడని అనుగ్రహించాడట. ఇది వరాహపురాణంలో చెప్పబడింది.