ఖాళీ స్థలంలో ఏదో ఒక రెండు దిశలుగా రెండు గృహాలను కూడా నిర్మించడం జరగటం పరిపాటి. ఇలా నిర్మించడం ద్వారా వాస్తును బట్టి కొన్ని మంచి ఫలితాలు, కొన్ని చెడు ఫలితాలను అందజేసేవిగా ఉంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా, వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాల్లో రెండు గృహాలు నిర్మించుకోవచ్చు అనే వివరాల్ని పరిశీలిస్తే.. ఖాళీ స్థలంలో దక్షిణ, పశ్చిమ భాగాలలో నిర్మించే రెండు గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వీటివలన ధనదాయం, కార్యాల సానుకూలత అనుకూలిస్తుంది.
పశ్చిమ దక్షిణ భాగంలో గృహాలు నిర్మిస్తే పశ్చిమంలో కంటే తూర్పువైపు ఎక్కువ స్థలం వదలాలి. తప్పనిసరిగా ఉత్తరం వైపు అధిక స్థలాన్ని వదలాలి. ఇలాంటి గృహ నిర్మాణంతో శుభ ఫలితాలు లభిస్తాయి. ఖాళీ స్థలంలో పశ్చిమ భాగంలో పూర్తిగా గృహాన్ని, మిగిలిన దక్షిణ భాగంలో ఒక గృహాన్ని నిర్మించవచ్చును.
ఈ విధంగా నిర్మించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఖాళీ స్థలంలో పడమర భాగంలో ఒక గృహాన్ని తరువాత కొంత ఖాళీ స్థలాన్ని వదిలి అదే రకపు గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇలా నిర్మించినపుడు ముఖ్యంగా పడమర ఖాళీ స్థలాని కంటే తూర్పువైపున ఖాళీ స్థలము ఎక్కువగా ఉండాలి. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.