కేంద్ర బడ్జెట్ సామాన్య భారతీయులకు ఆసరాగా నిలుస్తుందా లేక కార్పొరేట్ వ్యాపార సంస్థలకు కొమ్ము కాస్తుందా అనేది వచ్చే బడ్జెట్‌పై ప్రజల్లో మెదులుతున్న వెయ్యి డాలర్ల ప్రశ్న. జాతీయ ఆర్థిక మాంద్యాన్ని పారద్రోలి, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే దిశగా బడ్జెట్ ఉండాలని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు తొమ్మిది శాతానికి చేరుకున్నప్పటికీ సామాన్య ప్రజల కడగండ్లు తీరడంలేదనేది నిర్వివాదాంశం.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, తలకు మించిన రుణ భారంతో నిరాఘాటంగా కొనసాగుతున్న అన్నదాతల ఆత్మహత్యలు, కరువు రక్కసి కోరలు చాచడంతో సగటు గ్రామీణ భారతం పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస పోతోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న వలసలు కారణంగా ఆర్థికాభివృద్ధి ఎవరికి మేలు చేస్తుందనేది ఇట్టే అర్ధమైపోతుంది.
దేశ ప్రభుత్వ ఆదాయ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పన్నుల వసూళ్ళు ప్రభుత్వ రాబడిలో జమ అవుతున్నాయి. పన్ను చెల్లింపుల రూపేణా చేకూరిన ఆదాయంతో రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు జరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆహార ఉత్పత్తులు ముఖ్యంగా వంట నూనె, పప్పు ధాన్యాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఔషధాలపై పన్నులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.