పన్ను చెల్లింపుదారులకు వేధింపులు ఉండవని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం లోక్‌సభలో ఆమె 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని తెలిపారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేలా త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు.
అలాగే, వేతన జీవులకు ఆదాయపన్నులో ఇతోధికంగా ప్రయోజనాన్ని ఆమె కల్పించారు. ఆదాయ పన్ను స్లాబు రేట్లను గణనీయంగా పెంచారు. వివిధ స్థాయిల వేతన జీవులకు వేర్వేరు ఆదాయపన్ను స్లాబురేట్లను సృష్టించారు. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లుగానే 5 లక్షల రూపాయల వేతనం పొందుతున్న వారు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించనవసరం లేదని ఆమె ప్రకటించారు.
అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో నాన్ గెజిటెట్ పోస్టుల భర్తీకి నేషనల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 3.50 లక్షల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. బ్యాంకుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలని ఆమె పిలుపునిచ్చారు.