ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పాన్ నంబరు తప్పనిసరి. ఈ కార్డు ఉంటేనే పన్ను చెల్లించే వెసులుబాటు ఉండేది. అయితే, చాలా మందికి పాన్ కార్డు లేదు. దీంతో కేంద్రం కొత్త విధానాన్ని తీసుకుని రానుంది. ఆధార్ కార్డు ఉండేవారికి పాన్ కార్డు తక్షణం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఎలాంటి పత్రాలు చూపించనక్కర్లేదు. ఆధార్ కార్డు నంబరు ఇస్తే సరిపోతుంది.
ఈ విషయాన్ని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో వెల్లడించారు. ఇకపై పాన్ కార్డు లేని వారు తమ ఆధార్ కార్డు చూపిస్తే.. వెంటనే పాన్ కార్డు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ కొత్త వ్యవస్థను తీసుకురానుంది. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అప్లికేషన్ ఫిల్ చేయకుండానే.. ఆధార్ కార్డు చూపిస్తే.. పాన్ కార్డు మంజూరు చేస్తారు. ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు.
అలాగే, పన్ను చెల్లింపుదారుల కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం త్వరలోనే కొత్త విధానం తీసుకొస్తామన్నారు. ఎలాంటి దరఖాస్తును భర్తీ చేయాల్సిన పని ఉండదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పాన్ కార్డు మంజూరు చేస్తారు. ''చాలా ఈజీగా పాన్ కార్డు మంజూరు కోసం కొత్త సిస్టమ్ తీసుకురానున్నాం. దీని ప్రకారం ఆధార్ ఆధారంగా ఆన్ లైన్ లో పాన్ కార్డు మంజూరు అవుతుంది. ఎలాంటి అప్లికేషన్ నింపాల్సిన అవసరం లేదు'' అని సీతారామన్ ప్రకటించారు.