కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతం ఉంటుందని నివేదిక పేర్కొన్నారు. గత యేడాది కాలంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆర్థిక సర్వే నివేదికను తయారు చేస్తారు.
ఇది కేంద్ర బడ్జెట్‌తో సమానంగా ఉంటుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన టీమ్‌తో కలిసి ఈ నివేదికను తయారు చేశారు. శనివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ సర్వే రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. సర్వేలోని పూర్తి వివరాలు కాసేపట్లో మీడియాకు అందనున్నాయి. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
మరోవైపు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడుతూ, ఈ సెషన్‌లో మనం ఈ దశాబ్ధానికి కావాల్సిన బలమైన పునాదిని వేయాలన్నారు. ఈ సమావేశాల్లో ఎక్కువగా ఆర్థిక అంశాలపై చర్చిస్తామని ప్రధాని తెలిపారు. ఆర్థిక అంశాలపై ఉభయ సభల్లోనూ పూర్తి స్థాయి చర్చ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలు, దళితులు, అణగారిన ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే విపక్షాలు.. పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. గాంధీ విగ్రహం ముందు విపక్ష నేతలు సీఏఏకు వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా అనేక మంది నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.