Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాది విశిష్టత ఏమిటి?

Ugadi Wishes

సిహెచ్

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (15:13 IST)
"బ్రహ్మ" గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోను మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం.
 
అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మామిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రుచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావిజీవితాలు మృదుమధురంగా సాగించాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఉంటారు.
 
ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు.
 
ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు.
 
ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణం వల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి ఫలితాలు, ఆదాయం-వ్యయం ఎంతెంత?