దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఎందుకు?
భారతదేశం ఐక్యతకు మారుపేరు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అలాంటి భారతదేశాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రెండుగా చీల్చేస్తాయా? అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ నిపుణులు, రాజకీయ నేతలు కూడా. భార
భారతదేశం ఐక్యతకు మారుపేరు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అలాంటి భారతదేశాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రెండుగా చీల్చేస్తాయా? అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ నిపుణులు, రాజకీయ నేతలు కూడా. భారత్‌లో దక్షిణ భారతదేశం, ఉత్తరభారతదేశం అనే పేర్లు ముందు నుంచి వినబడుతున్నా.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఉత్తరాది నేతలు దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరాది నాయకులు దక్షిణాదిని చులకనగా మాట్లాడటం.. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోకపోవడం గమనార్హం.
దక్షిణాది బలంతో ఉత్తరాది నాయకులు అధికారంలోకి వచ్చి.. ఆపై దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడలేమంటూ కల్లబొల్లి మాటలు చెప్పి.. చేతులెత్తేస్తున్నాయి. ఇందుకు ప్రస్తుతం దేశంలో చోటుచేసుకున్న అంశాలే ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగైంది. ఎన్నికలకు ముందు, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో బీజేపీ విఫలమైంది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుకానుంది.
అంతకుముందే రాజకీయ పార్టీలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టేందుకు సై అంటోంది. ఇందుకు జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీడీపీని ఏకేయడం.. అంతకుముందు జగన్ పార్టీ అవిశ్వాసానికి రెడీ అని చెప్పడంతో దేశ రాజకీయాల్లో కదలిక మొదలైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నాయి. ఉత్తరాదిలోనూ ఎన్డీయే వ్యతిరేక రాష్ట్రాలన్నీ ఏకతాటిపై రానున్నాయి. సోమవారం అవిశ్వాసానికి స్పీకర్ అనుమతించి చర్చంటూ జరిగితే, మోడీగారి భవితవ్యం ఏంటో తేలిపోతుంది. సభ వాయిదా పడనీయకుండా.. అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చేందుకు ప్రతిపక్షాలన్నీ కార్యాచరణ రూపొందించడం మొదలెట్టాయి.
ఇందుకోసం ఏపీలోని టీడీపీ నేతలు ప్రతిపక్షాలను కూడగట్టుకుంటోంది. విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఈ మేరకు ఏపీలో వున్న సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎంపీల ద్వారా చక్రం తిప్పుతున్నారు. దక్షిణాది నేతలంటే అధికార గర్వంతో ఉత్తరాది నేతలు హేళన చేస్తున్నారని.. చంద్రబాబు గుర్రుగా ఉవున్నారు. ఈ ఆగ్రహాన్ని అవిశ్వాసం ద్వారా తెలియజేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వైకాపా అవిశ్వాసానికి రెడీ అయ్యింది. ఈ పరిస్థితులను చూస్తే దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య అగాధం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి.
ఈ వార్తలకు ఊతమిచ్చేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కేంద్రంపై మండిపడ్డారు. దేశానికి ఎక్కువ పన్నులు దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళ్తున్నాయని ఎత్తిచూపారు. కానీ కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న నిధులు మాత్రం చాలా తక్కువగా వున్నాయంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల విభజనకు సంబంధించిన వ్యాఖ్యలను ప్రాంతీయ పార్టీ నేతలే చేసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు చెందిన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చర్చ మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి చెందడంలో విఫలమయ్యాయని, వాటిని పోషించేందుకు దక్షిణాది రాష్ట్రాల సంపదనను వాడుకుంటున్నారని సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలే సబ్సిడీలను అందిస్తున్నాయని, దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాలే దేశానికి ఎక్కువ పన్నులు కడుతున్నాయని, కానీ కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రం వసూలు చేస్తున్న ప్రతి రూపాయి పన్నుకు కేంద్ర ప్రభుత్వ నిధుల రూపంలో రూ.1.79లు తిరిగి అందుతున్నాయని చెప్పారు. కానీ కర్ణాటకు కేవలం 47 పైసల కేంద్ర నిధులు మాత్రమే అందుతున్నాయని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు గొప్పగా అభివృద్ధి చెంది, దేశానికి భారీ సంపదను అందిస్తున్నాయని, అలాంటి దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి దక్కే ప్రతిఫలం ఇదేనా? అంటూ సిద్ధూ కేంద్రాన్ని నిలదీశారు,
కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు వివిధ రకాలైన పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతో పోల్చితే... కేంద్రం నుంచి తిరిగి వస్తున్న నిధులు అతి తక్కువ అని సిద్ధూ స్పష్టం చేశారు. నిధుల కోసం, పథకాల అమలు కోసం కేంద్రాన్ని దక్షిణాది రాష్ట్రాలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిద్ధరామయ్య మండిపడ్డారు. కేంద్ర పథకాలను మార్చుకునే వెసులుబాటు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉండాలని... దీంతో, తమ అవసరాలకు తగ్గట్టుగా పథకాలను తాము డిజైన్ చేసుకుంటామని తెలిపారు. ఇదేవిధంగా సిద్ధరామయ్య అభిప్రాయాలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లేవనెత్తారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో పాటు పలువురు తమిళ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వెల్లడించారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఏకమై విభజన కోరుకుంటున్నాయని.. తద్వారా ఉత్తరాది రాష్ట్రాలను పక్కనబెడితే దక్షిణాది అభివృద్ధి పరంగా దూసుకుపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా వెలిబుచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటవ్వాలే ఆకాంక్షను ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయనే భావన దక్షిణాది ముఖ్యమంత్రులు, నేతలు, ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని చెప్తున్నానని స్టాలిన్ చెప్పారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ తిరుగుబాటు, చంద్రబాబు సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో దేశ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.