మన సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష అక్కడక్కడా తొంగిచూస్తూనే వుంటుంది. అలాంటివారికి ఈ ఘటన ఓ కనువిప్పు. తల్లిదండ్రుల కష్టాలను కొడుకులు మాత్రమే అర్థం చేసుకుంటారని కొందరు భావిస్తుంటారు. అలాంటివారికి ఈ అమ్మాయి తన తండ్రి కోసం చేసిన పని చూస్తే కనువిప్పు కలుగుతుంది.
కోల్‌కతాకు చెందిన రాఖీ దత్తా అనే 19 ఏళ్ల యువతి తన తండ్రి కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతుండటాన్ని తట్టుకోలేకపోయింది. ఆయనకు కాలేయాన్ని మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. ఐతే ఆయనకు వేరెవరిదో కాలేయం అమర్చి, దానివల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాఖీ తనే కాలేయ దానం చేయాలని నిర్ణయించుకుంది.
తన తండ్రి కోసం తన లివర్‌లోని 65 శాతాన్ని దానంగా ఇచ్చింది. ఇలా చేయడం వల్ల తనకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి, సర్జరీ వలన కలిగే నొప్పి తదితర విషయాలు గురించి పట్టించుకోలేదు. శస్త్రచికిత్స తాలూకు ఏర్పడే గాట్లను అసలే పట్టించుకోలేదు. తన తండ్రి ఆరోగ్యమే ప్రధానంగా భావించిందా యువతి.
ఆమె తన తండ్రితో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్స్ గోయాంక, 'తండ్రి పట్ల కూతురు చూసే ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. కూతుర్లను చిన్నచూపు చూసే తల్లిదండ్రులకు ఇదే కరెక్ట్ సమాధానం' అంటూ పేర్కొన్నాడు.