Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్చ్.. "కాఫీ డే" సిద్ధార్థా… ఓసారి శిఖరం దిగిచూడాల్సింది… బతికేవాడివి..!!

Advertiesment
ప్చ్..
, గురువారం, 1 ఆగస్టు 2019 (18:15 IST)
ఈ ప్రపంచంలో తమకిక ఎవరూ లేరనే భావనతోనేనా? తాను కూర్చున్న శిఖరం మీది నుంచి కిందపడితే అందరూ నవ్వుతారనేనా? ఈ లోకాన్ని మనం ఎలా చూస్తున్నామనేదే కదా ముఖ్యం. ఈలోకం మనల్ని ఎలా చూసినా ఒకటే… ఇప్పుడు ప్రతివాడూ ఇంకొకడి గురించి కామెంట్స్ చేసే కాలమిది. పాపం, ఎవరో ఏదో అనుకుంటారని కేఫ్ కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఒకవేళ వ్యాపారంలో నష్టమొస్తే మాత్రం ఏమవుతుంది? ఆప్తులుగా నటించేవాళ్లు దూరమవుతారు. మనం కనపడగానే హడావుడి చేసే భజన బ్యాచ్ కంటికి కనిపించకుండా పోతుంది. చూడగానే లేచి నిలబడేవాళ్లు, ఇక కూచునే మాట్లాడతారు. రోజూ ఫోన్ చేసి పలకరించేవాళ్లు మన నెంబర్‌నే డిలీట్ చేసేస్తారు. ఛైర్మన్ స్థానం నుంచి దిగిపోతాం, ఆడంబరాలు తగ్గిపోతాయి. కానీ మనవాళ్లు, మనకోసం ఉండేవాళ్లు.. ఇవన్నీ లేనప్పుడు కూడా ఉంటారు. వాళ్లే మన బలం. 
 
మొహానికి ఎంత మేకప్ వేసుకున్నా సాయంత్రానికి కడిగేసుకోవాలి. మేకప్‌తోనే నిద్రపోతే మన మొహం రెండు రోజుల్లో వికారంగా మారి ఎలర్జీలు వచ్చేస్తాయి. ఈ పదవులు, ఈ మర్యాదలు, పదాతిదళం సన్మానాలు, పొగడ్తలు, టీవీ ఇంటర్వ్యూలు... ఇవన్నీ మేకప్‌లాంటివి. ఇవన్నీ కడిగేసుకుని ఎప్పటికైనా మనల్ని మనం అద్దంలో చూసుకోవాల్సిందే. 
గెలిచినప్పుడు అందరూ మనల్ని భుజాల మీద మోస్తారు. కానీ కాసేపటికి భుజం దిగి నేల మీదికి రావల్సిందే. ఎక్కువసేపు వాళ్లూ మోయలేరు. మనమూ ఉండలేం. జీవితంలో ఎంతో ఎదిగిన సిద్ధార్థకు నేల మీదికి రావటానికి భయమేసింది. అందుకే నదిలోకి నిష్క్రమించాడు. కొన్ని కోట్ల మందికి ఆ కాఫీ మాధుర్యాన్ని రుచిచూపించి, తను ఓ చేదుగా ముగిసిపోయాడు. 

రెండు దశాబ్దాల క్రితం తితిదేలో వినాయక్ అనే ఐఏఎస్ అధికారి ఈవోగా పనిచేసేవారు. ఆయనెంత బిజీగా ఉండేవారంటే ఆయనను కలుసుకోవాలంటే కొన్ని గంటలు పట్టేది. ఎప్పుడూ ఉత్సవాల నిర్వహణ, కొండకి వీవీఐపీల తాకిడి, దర్శన సేవల టికెట్ల కోసం ఒత్తిడి, ఒక మనిషి ఇన్ని పనులు ఎలా చేస్తాడా అనిపించేది. ఆ తర్వాత ఆయన ల్యాండ్ రెవిన్యూ కమిషనర్‌గా హైదరాబాద్‌కి బదిలీ అయ్యారు.
webdunia
 
నాంపల్లిలోని ఓ పాత భవనంలో ఆఫీసు. ఒకరోజు ఆయన్ని చూద్దామని అతనితో కలిసి పని చేసిన స్నేహితుడొకరు వెళ్లారు. ఆ ఆఫీసులో ఎలాంటి హడావుడీ లేదు. ఉద్యోగులు కూడా పెద్దగా లేరు. తితిదే ఆఫీసుకు, దీనికీ పోలికే లేదు. ఆయన గదిలోకి వెళితే ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. నవ్వుతూ పలకరించారు. ఈవోగా అంత బిజీగా ఉండేవాళ్లు, ఇప్పుడిక్కడ బోర్‌గా లేదా.? అనడిగాను… ఆయన నవ్వాడు. 
 
'కొండమీద దేవుడొకడే శాశ్వతం. మేమంతా ఆయన సేవ చేసుకుని వెనక్కి రావల్సిన వాళ్లమే. ఆ అధికారమే శాశ్వతం అనుకుంటే అమాయకత్వం అవుతుంది. అడుగడుగునా నమస్కారాలు, ప్రపంచం నలుమూలల నుంచి ఫోన్లు, బ్రహ్మోత్సవాల్లో దేవుడి ముందుండి నడవడం ఇదంతా ఒక ఫేజ్. అది అయిపోయింది. తిరుపతిలోనే వదిలేశాను. రేపు రిటైరై కొండకి వెళితే నన్నెవరూ గుర్తుపట్టకపోవచ్చు కూడా. క్యూ లైన్‌లో నన్ను తోసేయవచ్చు కూడా. అది కూడా ఒక ఫేజ్' అన్నారు. 
 
ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఆ మాటలు మాత్రం అలాగే గుర్తుండిపోయాయి. జీవితంలో కష్టమైన సందర్భం ఎదురైన ప్రతిసారీ ఆయన మాటలు గుర్తొస్తూనే ఉంటాయి. ప్రతిదీ ఒక ఫేజ్. సందర్భం, ఏదీ అలాగే ఉండిపోదు. ఇది అర్థమైతే బహుశా సిద్ధార్థ బతికే వుండేవారు. కనీసం ఛైర్మన్‌గాకాకుండా తన కుటుంబానికి ఓ ఇంటి పెద్దగా అయినా ఉండేవాడు. కానీ, తాను జీవించిన ఫేజ్ నుంచి బయటకురాలేక అర్థాంతరంగా తనువు చాలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫీజుల ఖరారుపై అధికారం సర్కారుకు లేదు : జీవో నిలిపివేసిన హైకోర్టు