వివాదాల్లో ఇరుక్కోవడం రాజయ్యకు అలవాటో లేదంటే తెలియకుండానే ఆయన్ను వివాదాలు చుట్టుముడతాయో తెలియదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ వివాదం ఆయన చంకలోనో నెత్తి మీదో లేదంటే జస్ట్ వెనకే పొంచుకుని వుంటుంది. ఆ వివాదం అలా ఆయన్ను సమీపించగానే కెమేరాలకు చక్కగా చిక్కిపోతారు రాజయ్య. మళ్లీ అదే జరిగింది.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చిలుపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతవరకూ బాగానే వుంది.
మధ్యాహ్నం భోజన సమయం కావడంతో అన్నం తినేందుకు సిద్ధమయ్యారు రాజయ్య. ఇంతలో ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని పిలిచి, అభినందన సభలో నువ్వు చాలా చక్కగా ప్రసంగించావంటూ ప్రశంసించటమే కాకుండా, నీ చేతితో రెండు అన్నం ముద్దలు తినిపించాలని కోరారట.
ఎమ్మెల్యే గారు అడగటంతో సదరు విద్యార్థిని స్వయంగా ఆయనకు అన్నం తినిపించేసింది. ఆ దృశ్యాలను కొందరు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముందు అది కాస్తా వైరల్ అయ్యింది. ఐతే ఈ వార్తపై ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ... తను తినిపించమని కోరలేదనీ, ఆ విద్యార్థినే, తనతో అంకుల్.. మీకు భోజనం తినిపిస్తానని కోరడంతో కాదనలేకపోయానని చెప్పారు. మరి ఇంతటితో అది ఫుల్ స్టాప్ అవుతుందో లేదో చూడాలి.