Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ యత్నాలు... మోడీ సానుకూలం?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలన్న తెరాస అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ వినతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సాను

Advertiesment
Telangana Assembly
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (11:55 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలన్న తెరాస అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ వినతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇదే జరిగితే వచ్చే లేదా అక్టోబరు మొదటివారంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆర్నెల్ల పాటు రాష్ట్రపతి పాలన రానుంది.
 
నిజానికి టి అసెంబ్లీ గడువు వచ్చే సంవత్సరం జూన్ వరకూ ఉంది. కానీ, వచ్చే నెలలో అసెంబ్లీని రద్దు చేసి, ఆపై డిసెంబర్‌లోగా జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే తెలంగాణలోనూ ఎన్నికలు జరిపించాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది. ఆ దిశగా ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు కూడా. 
 
కేసీఆర్ అనుకున్నట్టుగా అన్నీ జరిగితే అసెంబ్లీ రద్దు కావడం ఖాయం. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తే.. భారత రాజ్యాంగంలో శాసనసభ రద్దయితే, ఆరు నెలల్లోగా కచ్చితంగా ఎన్నికలు జరిపించాలన్న స్పష్టమైన నిబంధన ఏదీ లేదు. ఒకవేళ, ఆరు నెలలు దాటితే మాత్రం ఆపద్ధర్మ ప్రభుత్వం పడిపోయి, పాలన రాష్ట్రపతి చేతుల్లోకి వస్తుంది. 
 
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోగానీ, రాజ్యాంగంలోగానీ ఆరు నెలల నిబంధన లేదని గుర్తు చేస్తున్న రాజ్యాంగ నిపుణులు, ఏదైనా అసెంబ్లీ సీటు ఖాళీ అయితేనే ఆరు నెలల నిబంధన ఉందని, పూర్తి అసెంబ్లీ విషయానికి వస్తే, తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
 
ఇక అసెంబ్లీ కాల వ్యవధికి ప్రామాణికం తొలి సమావేశమే. తొలి సమావేశం తర్వాత ఐదేళ్ల పాటు అసెంబ్లీ కాల వ్యవధి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించే తేదీలు సైతం అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అసెంబ్లీకి సైతం ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాలని నిబంధన ఉంది. తెలంగాణ అసెంబ్లీ వేసవి సమావేశాలు మార్చి 29న ముగిశాయి. అంటే, తిరిగి సెప్టెంబర్ 28లోగా మరోసారి సమావేశం కావాల్సిందే. 
 
అసెంబ్లీని సమావేశపరచకుండా రద్దు చేసిన పక్షంలో మార్చి 29వ తేదీనే ఈసీ పరిగణనలోకి తీసుకుని అక్కడి నుంచి ఆరు నెలలను లెక్కిస్తుంది. అదే జరిగితే, సెప్టెంబర్ 28 తర్వాత తెలంగాణలో రాష్ట్రపతి పాలన మొదలవుతుంది. ఒకవేళ, సెప్టెంబరులో అసెంబ్లీని సమావేశపరిచి, ఆపై రద్దు చేస్తే, మార్చి వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వ హోదాలో కేసీఆర్ ప్రభుత్వమే పరిపాలించే అవకాశాలు ఉన్నాయి. 
 
అయితే, రద్దు తర్వాత ఎన్నికలు జరిపించే విషయం మాత్రం పూర్తిగా ఎన్నికల సంఘం విచక్షణపైనే ఆధారపడివుంటుంది. ఇలాంటి పరిస్థితిల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో స్వర్గం చూపి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటావా...