చెన్నై చిన్నారి అదరగొట్టింది. వంటల్లో శభాష్ అనిపించుకుంది. లాక్ డౌన్ సమయంలో అమ్మ సహాయంతో వంట నేర్చుకుని ఏకంగా ప్రపంచ రికార్డునే సాధించి సత్తా చాటింది. 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి ఔరా అనిపించింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రోజు చెన్నైలో ఆ చిన్నారి కేవలం 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి UNICO Book Of World Recordsలో చోటు సాధించింది. దీంతో ఆ చిన్నారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఎన్ లక్ష్మి సాయి శ్రీ అనే చిన్నారి లాక్ డౌన్ సమయంలో అమ్మ సహాయంతో వంట నేర్చుకుంది. అయితే వంటల్లో ఆమె రాణిస్తున్న తీరును గమనించిన తల్లి విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో అతను ఆ చిన్నారి ప్రపంచ రికార్డు పొందేలా ప్రోత్సహించాడు. ఈ విషయమై అతను ఇంటర్నెట్‌లో వెతకగా కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఏకకాలంలో 30 రకాల వంటలు వండినట్లుగా గుర్తించాడు. దీంతో ఆ రికార్డు బ్రేక్ చేయాలని తన కూతురును ప్రోత్సహించాడు. దీంతో ఆ చిన్నారి ఆ దిశగా సాధన చేసింది.
చైన్నైలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి UNICO Book Of World Recordsలోకి ఎక్కింది. ఈ సందర్భంగా ఆ చిన్నారి మాట్లాడుతూ.. తాను తన తల్లి నుంచే వంట చేయడం నేర్చుకున్నానని తెలిపింది. ఈ గొప్ప అవార్డును అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ చిన్నారి వంటల ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.