వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో కయ్యాలకు తెగబడుతున్న చైనాకు సంబంధించి అమెరికా చట్ట సభ ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్‌తో సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం చైనాకు స్పష్టం చేసినట్టైంది. సరిహద్దు వివాదాలను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు భారత్ వంటి మిత్రదేశాలకు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా ప్రకటించారు.
ఇందులో భాగంగా 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆ దేశ రక్షణ బిల్లు నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)కు అక్కడి కాంగ్రెస్ ఆమోద ముద్ర లభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై చైనా దురాక్రమణ గురించి భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీర్మానం కూడా ఇదే బిల్లులో భాగంగా ఉంది. ఇందుకు సభ్యుల ఆమోదం లభించడంతో ఈ తీర్మానానికి కూడా సమ్మతి లభించినట్లయింది. ఈ బిల్లును ఆపేందుకు తన విశేషాధికారమైన వీటోను వాడుతానని డొనాల్డ్ ట్రంప్ బెదిరించినప్పటికీ.. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందింది.