Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంకో రూ.లక్ష అధికంగా ఇస్తా... కలెక్టర్ చనిపోవడానికి సిద్ధమా?

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో స్థాపించిన స్టెరిలైట్ కాపర్ కర్మాగాన్ని మూసివేయాలంటూ ఆందోళనకు దిగిన నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

ఇంకో రూ.లక్ష అధికంగా ఇస్తా... కలెక్టర్ చనిపోవడానికి సిద్ధమా?
, బుధవారం, 23 మే 2018 (14:57 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో స్థాపించిన స్టెరిలైట్ కాపర్ కర్మాగాన్ని మూసివేయాలంటూ ఆందోళనకు దిగిన నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వందలాది వాహనాలు దగ్దం చేశారు. అలాగే, కలెక్టరేట్‌ను ధ్వంసం చేశారు.
 
పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోవడంతో.. తీరప్రాంత పట్టణం తూత్తుకుడి గుండెపగిలి రోదిస్తోంది. మూసుకున్న దుకాణాలు, బోసిపోతున్న రోడ్లు, స్థానికుల విషణ్ణవదనాలతో పట్టణమంతా దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. మంగళవారం జరిగిన ఈ మారణకాండలో గాయపడి చికిత్స పొందుతున్న తమ ఆప్తుల కోసం... మహిళలు, పిల్లలు, పురుషులు ప్రభుత్వ ఆస్పత్రి బయట ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మళ్లీ హింస చెలరేగకుండా పట్టణంలో అడుగడుగునా పోలీసు బలగాలను మొహరించారు. 
 
ఈ పోలీసుల కాల్పులపై సెల్వన్ అనే ఓ ఆందోళనకారుడు మాట్లాడుతూ, 'నా ముందున్న ప్రతి నలుగురిలో ఒకరు కళ్లముందే నేలకొరిగారు. పోలీసులు మాపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఏ వైపు నుంచి వస్తున్నాయో కూడా అర్థం కాలేదు. మేము అంబులెన్సుల వైపు పరుగెడుతున్నా కూడా పోలీసులు వెంటాడి మరీ పట్టుకునేందుకు ప్రయత్నించారు. మా ప్రాణాలను కాపాడే అంబులెన్సులను ఎందుకు తగలబెడతాం? మాకు రక్షణ కల్పించే బాధ్యత వారికి లేదా? ఓ ప్రైవేటు కంపెనీకి వారు ఎందుకు అంత భద్రత కల్పిస్తున్నారు?' అంటూ ప్రశ్నించాడు. 
 
అంతేకాకుండా, 'అసలు ప్రాణం విలువ తెలుసా ఆయనకు..? కారు తగలబడితే.. మనం దాన్ని మళ్లీ కొనవచ్చు. పోయిన ప్రాణాలను వారు తిరిగి ఇవ్వగలరా? నా సోదరి క్యాన్సర్‌తో చనిపోయింది. అందుకే నేను ఈ ఆందోళనలో పాల్గొన్నాను. వాళ్లేమో మా ప్రాణాలు తీసుకుంటున్నారు. తీరా రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటూ చెబుతున్నారు. నేను దానికంటే ఇంకో లక్ష రూపాయలు ఇస్తా... కలెక్టర్ చనిపోవడానికి సిద్ధమా?' అని ఆ యువకుడు ప్రశ్నించాడు. కాగా ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం ప్రకటించినంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదనీ... స్టెరిలైట్ కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయడం ఒక్కటే దీనికి పరిష్కారమని ఆందోళనకారులు ముక్తకంఠంతో చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా... అమ్మాయిలను బయటకు తీసుకెళ్లకుండా?