ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లా చీడికాడ మండలంలోని అప్పలరాజపురానికి చెందిన గవిరెడ్డి దేముడుబాబు కుటుంబం గురించి తెలుసుకుంటే అందరూ షాకవుతారు. రాష్ట్రంలో హోరాహోరీగా తలపడుతున్న మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైకాపా, జనసేనలకు ఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దేముడుబాబుకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. దేముడు బాబు కుమార్తె సుజాత అలియాస్ రమ్య శ్రీ సినీనటి ఈమె సినిమాల్లో నటిస్తూనే.. తన పేరిట ఓ స్వచ్ఛంధ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
రమ్యశ్రీ సోదరుడు సన్యాసినాయుడు దివంగత నేత హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈసారి టికెట్ ఆశించిన ఆయనకు జగన్ మొండిచేయి చూపడంతో జనసేనలో చేరి మాడుగుల టికెట్ సంపాదించారు.
రమ్యశ్రీ మరో సోదరుడు రామానాయుడు 2009లో మాడుగుల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందినవారు మూడు ప్రధాన పార్టీల్లో ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.