Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వయసు 71 యేళ్లు.. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? రజినీకాంత్

నా వయసు 71 యేళ్లు.. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? రజినీకాంత్
, గురువారం, 12 మార్చి 2020 (11:42 IST)
తనకు ఇపుడు 71 యేళ్లు.. ఈ వయసులో తనకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? అంటూ సినీ నటుడు రజినీకాంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దివంగత నేతలు కరుణానిధి, జయలలితల మరణం తర్వాత రాజకీయ శూన్యత నెలకొనివుందన్నారు. వీరిద్దరూ లేకపోవడం వల్లే తాను ప్రజల్లోకి వస్తున్నట్టు చెప్పి, తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. 
 
తన రాజకీయ ప్రవేశంపై రజినీకాంత్ గురువారం చెన్నైలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, '1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి నేను ఆలోచించలేదు. ఈ విషయంపై ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. 2017లోనే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను' అని స్పష్టం చేశారు. 
 
'నేను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నాను. నా అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అన్ని ఊహాగానాలకు నేడు ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. 2016-17లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించింది. మంచివారు రాజకీయాల్లోకి రావట్లేదు' అని వాపోయారు. 
 
'వ్యవస్థను సరిచేయకుండా మార్పురావాలని కోరుకోవడం సరికాదు. నేను పార్టీ ప్రారంభిస్తున్నాను. నాకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు. నీతి, నిజాయతీ, ప్రజల మనసులో స్థానం ఉన్నవారికే సీఎం అయ్యే అర్హత ఉండాలి. నా పార్టీలో 60 నుంచి 65 శాతం వరకు యువతకే అవకాశం. మిగిలిన టిక్కెట్లను మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేటాయిస్తాను' అని చెప్పారు. 
 
అలాగే, పదవులకు ఆశపడి ఎవరూ తన వద్దకు రావొద్దన్నారు. పైగా, పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్నారు. ప్రభుత్వ పాలనలో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. పార్టీకి, ప్రభుత్వానికి వేర్వేరుగా కమిటీలు ఉంటాయి. ఈ రెండు కమిటీలో ఇతరు విషయంలో జోక్యం చేసుకోదు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే, 'రాజకీయాల్లో విద్య, వయసు కూడా ముఖ్యమే. నా పార్టీలో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యతనిస్తాను. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు. నేను పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను. 45 ఏళ్లుగా సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయి' అని రజికాంత్ చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే రాజకీయ నాయకుల వారసులై ఉండాలన్నారు. కానీ, తన పార్టీలో స్థానికంగా మంచి పేరుతో పాటు.. ఆరోగ్యవంతంగా, ఆర్థికంగా ఉంటేచాలన్నారు. ఇలాంటి యువతకే తమ పార్టీ కేటాయిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మనస్సుల్లో, వ్యవస్థలో మార్పు రావాలన్నారు. అపుడే సమాజం బాగుపడుతుందన్నారు. లేకపోతే, తనలాంటివారు ఎంతమందివచ్చినా ఈ వ్యవస్థ ఇలానే ఉంటందని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలులో 65 యేళ్ళ వృద్ధురాలికి కరోనా?