కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వాయినాడ్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల కేరళ రాష్ట్రాన్ని వరదలు, వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే అనేకసార్లు పర్యటించిన ఆయన... బుధవారం మరోమారు అక్కడ పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా, వాయినాడ్ లోక్‌సభ పరిధిలోని బవళి గ్రామంలో వరద బాధితులను కులుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అన్ని రకాలుగా అండగా ఉంటానని వారికి రాహుల్ హామీ ఇచ్చారు.
గ్రామస్థులతో సమావేశం అనంతరం రాహుల్ తిరుగుపయనమయ్యేందుకు కారు ఎక్కారు. కారులో కూర్చున్న రాహుల్‌కి సడన్‌గా వచ్చి ఓ యువకుడు కరచాలనం చేసి.. ఆపై ఎవరూ ఊహించని విధంగా ముద్దు పెట్టాడు. సెక్యూరిటీ సిబ్బంది పక్కకు లాగుతున్నా కూడా రాహుల్‌కి ముద్దు పెడుతూనే ఉన్నాడు. చివరికి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పక్కకి పంపించేశారు.
ఆ యువకుడు చేష్టలతో రాహుల్ గాంధీతో పాటు.. భద్రతా సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, వాయినాడ్‌లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.