Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కష్టకాలంలో కడుపు నింపారనీ... అలా రుణం తీర్చుకున్నారు...

కష్టకాలంలో కడుపు నింపారనీ... అలా రుణం తీర్చుకున్నారు...
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:51 IST)
కరోనా కష్టాలు అన్నీఇన్నీకావు. కూలోడు నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరినీ ఈ కరోనా వైరస్ అష్టకష్టాలుచేసింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొనేలా చేసింది. అలాగే, అనేక మంది పేదలు ఆకలితో అలమటించేలా చేసింది. లక్షలాది మంది వలస కూలీల జీవనాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇలాంటి కష్టకాలంలో తమను ఆదుకుని కడుపునిండా అన్నం పెట్టినందుకు కొందరు వలసకూలీలు తమ రుణం తీర్చుకున్నారు. తమకు ఆశ్రయం కల్పించిన బడితో పాటు బడి ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని శికర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశంలో గత ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే మూడో తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వలస కూలీలు ఎక్కడివారే అక్కడే చిక్కుకునిపోయారు. పైగా, వలస కూలీలకు ఆయా రాష్ట్రాల్లో తాత్కాలిక శిబిరాలను కల్పించారు. 
 
అలా రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలో కొందరు వలస కూలీలకు ఓ గ్రామంలో ఉన్న పాఠశాల భవనంలో ఆశ్రయం కల్పించారు. వారికి గ్రామస్థులే మూడు పూటలా భోజనం పెడుతున్నారు. స్వీటుతో పాటు కమ్మటి తిండిని వడ్డిస్తూ వారి ఆకలి తీర్చుతున్నారు. దీంతో ఆ గ్రామస్థుల రుణం తీర్చుకోవాలని ఆ వలస కూలీలు భావించారు. 
 
అంతే... తమకు వచ్చిన ఆలోచను ఆచరణలో పెట్టారు. తాము ఉంటున్న బడికి సున్నాలు వేసి అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదండోయ్... ఆ బడి ప్రాంగణాన్ని కూడా అందంగా ముస్తాబు చేశారు. ఇందుకోసం అవసరమైన వస్తు సామాగ్రి, సున్నం, రంగులు, బ్రష్‌లను గ్రామ సర్పంచ్ సమకూర్చారు. దీంతో వలస కూలీలు తమకు ఆశ్రయం కల్పించిన పాఠశాల భవాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
 
అయితే, ఈ వలస కూలీలు చేసిన పనికి గ్రామస్థులంతా కలిసి తృణమో పణమో ఇద్దామని భావించారు. కానీ, ఆత్మాభిమానం కలిగిన ఆ వలస కూలీలు ససేమిరా వద్దన్నారు. భోజనం పెట్టారు చాలు.. అదే పదివేలు అని చేతులవెత్తి నమస్కారం పెట్టారట. ఎందరో కష్టజీవులు కరోనా లాక్‌డౌన్ ఫలితంగా అష్టకష్టాల పాలయ్యారు. కాలనడకన సొంతూరికి నడుచుకుంటూ ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 
 
కానీ మన కథలోని వలస కార్మికులు అదృష్టవంతులు. వారిని అధికారులు బళ్లల్లో పెట్టడం వల్ల వారికి రోజులు సుఖంగా గడిచాయి. స్కూళ్లు భవనాలు మెరుగుపడ్డాయి. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని చెప్పుకుంటారేమో ఆ స్కూళ్లల్లో చదివే పిల్లలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో గర్భిణీలకు కరోనా.. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు..