కరోనా వైరస్ దేశాన్ని పట్టిపీస్తున్న సమయంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులు లేదా వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఏడేళ్ళ జైలు శిక్షతో పాటు.. భారీగా అపరాధం విధించనున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాత చట్టానికి సవరణలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా, ఈడీయే చట్టానికి మార్పులు చేర్పులు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదముద్రవేసింది. ఈ చట్ట సవరణలో భాగంగా, వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలుంటాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టి, వెంటనే జైలుకు తరలిస్తారు. నేరం నిరూపితమైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, రూ.లక్ష నుంచి రూ.7 లక్షల వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
అలాగే, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ స్పందిస్తూ, "దేశమంతా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్న వేళ, కొందరు మాత్రం వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఆరోపిస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో ఇటువంటి దాడులకు స్థానంలేదు. అంత తీవ్రంగా లేని కేసుల్లో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, తీవ్రమైన కేసుల్లో రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల జరిమానా, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు" అని ఆయన వివరించారు.
ఈ చట్టంతో డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, అటెండర్లు తదితరాలకు రక్షణ కలుగుతుందని జావడేకర్ వ్యాఖ్యానించారు. హెల్త్ కేర్ నిపుణులకు బీమా కవరేజ్‌ని కూడా పెంచినట్టు తెలిపారు. అంతేకాకుండా, దేశంలో 735 కొవిడ్ ఆస్పత్రులు, రెండు లక్షలకు పైగా బెడ్లు, 15,000 వెంటలేటర్లు, ఎన్-95 మాస్కులు 25 లక్షలు అందుబాటులో ఉన్నాయని, మరో 50 లక్షల మాస్కుల తయారీకి ఆదేశించామని చెప్పారు.