పంజాబ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ రాష్ట్రంలోని పటియాలా రాజీవ్ గాంధీ లా విశ్వవిద్యాలయానికి చెందిన 60 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ విద్యార్థులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్శిటీలో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా ఈ నెల 10వ తేదీ వరకు హాస్టల్స్ ఖాళీ చేసి తమతమ ఇళ్లకు వెళ్లిపోవాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆదేశించారు.
కాగా, ఇటీవలి కాలంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినిలకు పాజిటివ్ వచ్చింది. అలాగే, ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్‌లోని ఓ స్కూల్‌లో అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. మద్రాస్ ఐఐటీలో సుమారుగా 200 మంది విద్యార్థులు ఈ వైరస్ బారినపడ్డారు.
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 3275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 55 మంది చనిపోయారు. 3010 మంది కరోనా బాధితులు ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,91,393కు చేరుకోగా, మృతులు 5,23,975 మంది ఉన్నారు.