Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా? తెరపైకి పలువురు పేర్లు

draupadi murmu
, శుక్రవారం, 10 జూన్ 2022 (07:20 IST)
దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికకు నగారా మోగింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుండటంతో ఈ అత్యున్నత పదవికి పోటీపడే అభ్యర్థులు ఎవరనే చర్చ జోరందుకుంది. ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎవరిని తెరపైకి తీసుకొస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. 
 
కానీ, జాతీయ స్థాయిలో అధికార, ప్రతిపక్ష శిబిరాలు సరైన అభ్యర్థిని బరిలో దించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇంతలోనే కొందరి పేర్లు మాత్రం తెరపైకి వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికలకు అధికార కూటమి తరపున ముఖ్యంగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, అస్సాం గవర్నర్‌ జగ్దీశ్‌ ముఖి, ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయ యూకీ పేర్లు వినబడుతున్నాయి. అయితే, ప్రతిపక్ష శిబిరం నుంచి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌లను బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలో దించుతున్నట్టుగా వస్తోన్న ఊహాగానాలను ఇప్పటికే శరద్‌ పవార్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఎన్డీయే కూటమికి విస్పష్ట మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆ కూటమికి పోటీగా దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 
 
శరద్‌ పవార్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ కావడం.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ అగ్రనేతలతో సమావేశమైన నేపథ్యంలో ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్‌ను బరిలో దించబోతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ కొనసాగిన విషయం తెలిసిందే.
 
గత రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టిన భాజపా.. ఈసారి రాష్ట్రపతిగా ఆదివాసీలు లేదా మహిళలకు ఛాన్స్‌ కల్పించే అవకాశం కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. దీంతో ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, అనూహ్యంగా చివరకు రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే తమ అభ్యర్థిగా బరిలో దించిన విషయం తెలిసిందే. 
 
ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం ద్రౌపది ముర్ముకే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకోవైపు, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన భాజపా ఈ ఎన్నికల్లో అటువైపు నుంచి ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలూ లేకపోలేదన్న వాదనలూ ఉన్నాయి. 
 
కర్ణాటక మినహా దక్షిణాదిలో ఎక్కడా ప్రబల శక్తిగా ఎదగని కమలనాథులు.. రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళి సైలకు ఛాన్స్‌ ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. తమిళిసై తమిళనాడుకు చెందినవారు కావడంతో పాటు ఓబీసీ సామాజిక వర్గానికి చెందడం ఆమెకు కలిసి రావొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సీఎన్‌జీ ర్యాలీని నిర్వహించిన ఏజీ అండ్‌ పీ ప్రథమ్‌