దేశంలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టం 2019 అమల్లోకి చ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా వసూలు చేస్తున్నారు.
తాజాగా నోయిడాలో బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఆన్‌లైన్ చలాన్ విధించారు. హెల్మెట్ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ.500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు.
నోయిడాకు చెందిన నిరాంకార్ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని, అందుకు రూ.500 చలాన్ చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు నోటిసు పంపారు.
దీంతో బిత్తరపోయిన నిరాంకర్ సింగ్ డ్రైవర్ బస్సు నడిపేందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్ వస్తే పరిస్థితేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.