పుల్వామా ఉగ్రదాడి కేసును కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్రం ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సంఘటన జరిగిన ప్రదేశం నుండి ఇప్పటికే ఆధారాలు సేకరించి మరింత లోతుగా విచారణ జరుపుతున్న ఎన్ఐఏకు అనేక సంచలన వాస్తవాలు తెలుస్తున్నాయి.
దాడిలో పేలుడు జరిగేందుకు ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ను చిన్న పిల్లలు, మహిళల ద్వారానే ఒక చోటి నుండి మరో చోటికి తరలించినట్లు ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ తరలింపు ప్రక్రియను దాదాపు కొన్ని నెలలపాటు చేసినట్లు నిర్ధారించారు. కాగా ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన పరికరాలను మాత్రం స్థానికంగానే తయారు చేసినట్లు తెలుస్తోంది.
పేలుడులో ఉపయోగించిన ఆర్డీఎక్స్ 99.5 శాతం నాణ్యత కలిగి చాలా ఖరీదైనదని పేర్కొంది. ఈ ఆర్డీఎక్స్‌ను రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ నుండి కొనుగోలు చేసి, ఆపై దాన్ని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు అందజేసినట్లు తెలుసుకున్నారు. 2018 నుండే పుల్వామాలోని ట్రాల్ గ్రామానికి బ్యాగులు, సిలిండర్లు, కోల్ బ్యాగ్స్ ద్వారా తరలించినట్లు ఆధారాలు సేకరించారు.