ఎస్పీ బాలసుబ్రమణ్యం.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి - ఎస్పీ బాలు.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుచేత బాలును చిరంజీవి అన్నయ్యా అని పిలిచేవారు.
అయితే... ఏమైందో ఏమో కానీ చిరంజీవి బాలును అన్నయ్యా అని కాకుండా.. మీరు అని పిలవడం స్టార్ట్ చేసారట. ఇలా ఎందుకు పిలిచేవారో చిరంజీవి బయటపెట్టారు.
దీని గురించి చిరంజీవి ఏం చెప్పారంటే... చెన్నైలో తామిద్దరి ఇళ్లు పక్కపక్క వీధుల్లోనే ఉండేవి. బాలు కారణంగానే తన పాటలు అంత పాపులర్ అయ్యాయి. నా కెరీర్ తొలి దశ నుంచి నన్ను అక్కున చేర్చుకున్న ఆయన్ను అన్నయ్య అని పిలిచేవాడ్ని.
తర్వాత కాలంలో బాలు ఎంత గొప్పవారో, ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో అర్థం చేసుకొని మీరు అని సంభోదించేవాడ్ని. మొదట్నుంచి నన్ను అన్నయ్య అని పిలిచేవాడివి. ఇప్పుడు కొత్తగా మీరు అని పిలిచి నన్ను దూరం చేయకు అనేవారు బాలు అని చిరంజీవి బాలుతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు.
కమర్షియల్ స్టార్‌గా కొనసాగుతున్న తను.. మధ్యమధ్యలో ఆపద్బాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలు చేయడానికి బాలు కూడా ఓ కారణం అన్నారు చిరంజీవి. నువ్వు మంచి నటుడివి.. రెగ్యులర్ కమర్షియల్ మూవీసే కాకుండా నీలో ఉన్న నటుడు బయటకు వచ్చే సినిమాలు చేయాలని చెప్పేవారు. ఆయన అలా చెప్పడం వలనే తను మంచి సినిమాలు చేయగలిగానని అన్నారు చిరంజీవి.