కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా- ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ తాజాగా పాల్గొన్నారు. రేస్ సమయంలో ఆయన నడుపుతున్న కారు కంట్రోల్ తప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయ్యింది. అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.
2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది.
అంతకుముందు, 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ పోటీల కోసం శిక్షణలో ఉండగా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇలా వరుసగా కారు రేసులో అజిత్ పాల్గొనడం.. ప్రమాదాలు జరగడంపై ఆయన ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నారు.
కానీ కారు రేస్ ఆయన ఫ్యాషన్ కావడంతో దాన్ని వదులుకోమని అజిత్ ఫ్యాన్స్ గట్టిగా చెప్పలేకపోతున్నారు. కాగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది