జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యం : తేల్చి చెప్పిన సీఈసీ ఓపీ రావత్
లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని
లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. అలాగే, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు చేస్తున్న ముందస్తు ప్రయత్నాలకు కూడా ఈసీ బ్రేక్ వేసింది.
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు అవసరమని గుర్తు చేశారు. ఇందుకు లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలన్నారు. ఒకవేళ సవరణలకు అంగీకరిస్తే అందుకు చట్ట సభ్యులు కనీసం ఏడాది సమయం తీసుకుంటారని, కాబట్టి ప్రస్తుతానికి జమిలికి వెళ్లే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సాధారణంగా 14 నెలల ముందుగానే కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు. తమ వద్ద 400 మంది సిబ్బందే ఉన్నారని, అయితే, ఎన్నికల నిర్వహణకు మాత్రం కోటిమందికిపైగా వినియోగించుకుంటామన్నారు. జమిలి ఎన్నికల విషయానికి వస్తే అదంత ఆషామాషీ కాదన్నారు. సిబ్బంది, భద్రత, ఈవీఎంలు, వీవీపాట్ తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని తేల్చి చెప్పారు.
ఈ సంవత్సరాంతంలో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్‌సభకూ జరపడానికి తాము సిద్ధమని రావత్ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన లోక్‌సభకు ముందస్తు కాదనీ, జమిలి మాత్రమేనని ఢిల్లీ రాజకీయ వర్గాలంటున్నాయి.