బెంగళూరు నగర వీధుల్లో రక్తపు మరకలతో కూడిన దుస్తులను ధరించి.. ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఏడుగురు యూట్యూబర్లను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ కావాలనుకున్న ఏడుగురు యూట్యూబర్లు తెలుపు వస్త్రాలను ధరించి.. రక్తపు మరకల్లాంటి రంగులను ఆ దుస్తులపై చల్లుకున్నారు.
అలాగే చూసిన వారు భయపడే రీతిలో మేకప్ వేసుకున్నారు. ఇలా ప్రజలను భయపెట్టి ఆ దృశ్యాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో ముందున్న యూట్యూబ్‌లో పోస్టు చేయాలనుకున్నారు. కానీ సీన్ రివర్సైంది. పోలీసులు ఆ ఏడుగురిని అరెస్ట్ చేశారు.
అయితే ఆ ఏడుగురు యూట్యూబర్లు ఆ మేకప్‌తో ఆటో డ్రైవర్‌ను భయపెట్టారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆటో డ్రైవర్.. యశ్వంత్ పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు యూట్యూబర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అరెస్టయిన ఏడుగురు యువకులను షాన్ మాలిక్, నావిద్, షాజిల్ మొహ్మద్, మొహ్మద్ అక్యూబ్, షాకిబ్, సయ్యద్, యూసుఫ్ అహ్మద్‌గా గుర్తించారు. వీరందరూ 20-25 సంవత్సరాల్లోపు వారేనని పోలీసులు వెల్లడించారు. ఇంకా వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఏడుగురు బెయిల్‌పై విడుదలయ్యారు.