Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం.. కానీ, ప్రపంచమంతటా అశాంతి!

Advertiesment
International Day of Peace
, శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:37 IST)
ప్రతి యేటాది సెప్టెంబరు 21వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుతుంటారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982 సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నారు. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు లేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచూపుతోంది. శాంతి దినోత్సవం రోజున కపోతాలు (తెల్లని పావురాలు) ఎగురవేసి శాంతిపట్ల తమకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంటారు అనేక దేశాధినేతలు. వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచ శాంతికోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి అంతర్జాతీయ శాంతి దినోత్సవం పాటిస్తారు. 
 
ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల నుంచి చిన్నారులు పంపిన నాణాలను కలిపి విరాళంగా వచ్చిన మొత్తంతో అసోసియేషన్ ఆఫ్ జపాన్ వారు ఐరాసకు ఒక గంటను బహూకరించారు. న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్‌కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటుచేశారు. ఏటా శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను ఈ గంటను మోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు. 
 
దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచానికి శాంతిని ప్రబోధించేలా శాంతి గంటను మోగిస్తారు. 1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా ఒక తీర్మానం సమర్పించింది. దాని ప్రకారం ఏటా సెప్టెంబర్ 21వ తేదిన ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. 
 
ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరం 2008 సెప్టెంబర్ 21వ తేది కూడా చరిత్రలో నమోదైంది. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన కృషిని గుర్తించిన జేమ్స్ మాడిసన్ యూనివర్శిటీలోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈనెల 21న వర్జీనియాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేస్తారు. 
 
ఈ శాంతి దినోత్సవాన్ని ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. కొవ్వొత్తి వెలిగిస్తే చాలు. మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు. సహోద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు దీన్ని నిర్వహించి శాంతి అవశ్యకతను ప్రజలకు చక్కగా వివరించవచ్చు. 
 
అందరూ ఆనందంతో ఉంటే ఆ దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా ఉంటుంది. శత్రుత్వం ద్వేషాన్ని పెంచి, చుట్టుపక్కల వారి మధ్య కలహాలతో మనశ్శాంతి, సుఖశాంతులు కరవవుతాయ. సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంతో, స్నేహభావంతో మెలిగితే ఏ దేశమైనా ఆనందనందనం అవుతుంది. అందుకే ప్రతి యేడాది శాంతి దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రపంచం నలువైపులా జరుపుకుంటుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిదంబరానికి బెయిల్​ వద్దు.. ప్లీజ్: సీబీఐ