దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఈయన జయంతి వేడుకలు ప్రతి యేటా జనవరి 23వ తేదీన నిర్వహిస్తుంటారు. అయితే, ఈ యేడాది నుంచి ఈ వేడుకలను పరాక్రమ్ దివస్‌గా నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది.
ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిషా రాష్ట్రంలోని కటక్‌లో 1897, జనవరి23న ప్రభావతి దేవి, జానకినాథ్ బోస్ దంపతులకు నేతాజీ జన్మించారు. నేతాజీ తండ్రి ఓ న్యాయవాది. జాతీయవాది కూడా అయిన ఆయన బెంగాల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.
చిన్నతనం నుంచి చురుగ్గా ఉండే నేతాజీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రభావంతో సన్యాసం స్వీకరించారు. మానవసేవే మాధవసేవ అన్న రామకృష్ణుడి ఉపదేశంతో దేశసేవకు నడుంకట్టారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పోరాటాల్లో భాగస్వామి అయ్యారు.
1920లో ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనప్పటికీ తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదులుకొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే తనప ప్రథమ కర్తవ్యంగా భావించి ఉద్యమంలోకి దూకారు. స్వాతంత్ర్యం రావాలంటే సొంత సైన్యంతో పాటు ఇతర దేశాల సహకారం కూడా అవసరమని భావించాడు.
ఆజాద్ హిందూ ఫైజ్‌ను స్థాపించి భారత్‌కు స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకపాత్ర వహించాడు. అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది.
అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.