దేశ ప్రజలకు ఓ శుభవార్త. కరోనా వైరస్ కష్టకాలంలో ఈ వార్త ప్రజలకు ఎంతో ఊరట కలిగించేలావుంది. మరో 73 రోజుల్లో కరోనా విరుగుడు మందు రానుందట. ఈ మందును కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా అందజేయనున్నారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయించిది. ఇందుకోసం నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దేశ వాసులందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ను అందించాలని కూడా నిర్ణయించింది.
తొలి కోవిడ్ వ్యాక్సిన్ సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి 'కోవీషీల్డ్' పేరిట రానుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మరో 73 రోజుల్లో వస్తుందని, సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.
దీనికి సంబంధించి కేంద్రం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయనీ, స్పెషల్ మాన్యుఫాక్చరింగ్ ప్రియారిటీ లైసెన్స్‌ను కూడా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం అన్ని రకాల పరీక్షల అనంతరమే ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్ 58 రోజుల్లో ముగుస్తాయని తెలిపారు. మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ శనివారం నాడు ప్రారంభం అయ్యాయని, ఆపై 29 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తామని, దాని తర్వాత 15 రోజల్లోనే ఫలితాల వెల్లడి ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. తుది ఫలితం వచ్చే సమయానికి వ్యాక్సిన్‌ను కమర్షియల్‌గా విడుదల చేయాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు.
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 సెంటర్లలో 1600 మందిపై ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సీరమ్‌కు ఇప్పటికే అనుమతులు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాతో పాటు 92 నగరాల్లో వ్యాక్సిన్‌ను విక్రయించేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆస్ట్రాజెనికాల మధ్య డీల్ కుదిరింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే వ్యాక్సిన్ తయారీపై సీరమ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు 68 కోట్లడోస్‌లను వచ్చే సంవత్సరం జూన్ నాటికి అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. మిగతా వారికి భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వంటి కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను అందించనుంది.
అయితే, భారత్ బయోటెక్ ఎప్పటికి వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేస్తుందన్న సమాచారాన్ని ఇంకా కేంద్రానికి వెల్లడించలేదు. తాము త్వరితగతిన వ్యాక్సిన్ ఇవ్వాలని భావించడం లేదని, దానిని సురక్షతను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే విడుదల చేస్తామని భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ ఇప్పటికే వెల్లడించారు.