Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కానిస్టేబుల్ కాదు.. ఆపద్బాంధవుడు... అంబులెన్స్ కోసం పరుగో పరుగు...!

కానిస్టేబుల్ కాదు.. ఆపద్బాంధవుడు... అంబులెన్స్ కోసం పరుగో పరుగు...!
, గురువారం, 5 నవంబరు 2020 (09:25 IST)
అతను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ రోగి ప్రాణాలు రక్షించేందుకు ఆపద్బాంధువుడుగా మారిపోయాడు. అంబులెన్స్ సైరన్ వినగానే.. దానికి దారి ఇచ్చేందుకు.. తప్పుకోండి... తప్పుకోండి అంటూ బిగ్గరగా అరుస్తూ, రోడ్డుపై పరుగులు తీస్తూ, అంబులెన్స్‌ సాఫీగా వెళ్లేందుకు మార్గం చూపించాడు. ఫలితంగా అందులో ఉన్న రోగి ప్రాణలతో బయటపడింది. అదేసమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరిచిన ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్ నగంరలని అబిడ్స్ ఏరియాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అబిడ్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీ ఈ నెల 2న ఆబిడ్స్‌ సర్కిల్‌లో విధుల్లో నిమగ్నమైవున్నాడు. సాయంత్రం కార్యాలయాలు వదిలే సమయం కావడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంది. ఆ సమయంలో అబిడ్స్ చౌరస్తా నుంచి కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లే మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. 
 
ఇదేసమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని తీసుకువస్తున్న అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన బాబ్జీ వెంటనే అంబులెన్స్‌ ముందు పరుగులు తీస్తూ తప్పుకోండి.. తప్పుకోండి.. అంటూ బిగ్గరగా అరుస్తూ, ముందున్న వాహనాలను క్లియర్‌ చేస్తూ అంబులెన్స్‌కు వెళ్లేందుకు దారి ఏర్పరిచాడు. ఆబిడ్స్‌ బిగ్‌ బజార్‌ నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్‌ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు అంబులెన్స్ ముందు పరుగెత్తాడు. 
 
ఈ దృశ్యాన్ని అంబులెన్స్‌లోని రోగి బంధువులు వీడియో తీశారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రాణాపాయం నుంచి ఆ రోగి బయటపడ్డాడు. కానిస్టేబుల్‌ చేసిన సహాయానికి కృతజ్ఞతగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. విభాగం ఉన్నతాధికారులు సహా ప్రతి ఒక్కరూ బాబ్జీని అభినందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత అమ్ములపొదిలోకి మరో రాఫెల్ యుద్ధ విమానాలు!