ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గత రెండేళ్లుగా పని చేస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా తన పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రచారం చేస్తున్నానని వివరించారు.
'దాదాపు లక్షా 50 వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించాను. నా పాటలు, ప్రసంగాలతో ప్రజల్లో కదలిక తెచ్చాను' అని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ సర్కారు మనువాద సిద్ధాంతం ఆధారంగా భూస్వామ్య, కుల వ్యవస్థలోకి జారిపోతున్నాయని విమర్శించారు.
దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఓటర్ల జాబితాలో తన పేరు నమోదు చేయించుకున్నానని చెప్పారు. ప్రతిపక్షాలన్నీ తన అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తానని మీడియా ద్వారా తెలియజేశానని, దీనిపై ఇంతవరకు ఏ పార్టీ స్పందించలేదని తెలిపారు.
తన లక్ష్యాన్ని తెలియజేసేందుకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులను కలిశానని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసి ఆయనను కూడా కలిశానని తెలిపారు.