కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ ఉధృతం కారణంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే కర్ఫ్యూ విధించాయి. కరోనా వైరస్ మన దేశంలో ప్రబలడం మొదలైన నాటి నుంచి కరోనా వారియర్స్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఇదే కోవలో ఓ మహిళా డీఎస్పీ.. గర్భంతో ఉన్నా మండుటెండలోనూ కరోనా విధులను నిర్వహిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ దంతేవాడ డివిజన్ డీఎస్పీ శిల్పా సాహు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని సీనియర్ సిటిజన్లు, మహిళలను చైతన్యపరిచే విధులను నిర్వర్తిస్తున్నారు.
ఇది కామనే కావొచ్చు కానీ.. సదరు యువ డీఎస్పీ ప్రస్తుతం గర్భంతో ఉన్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూసేందుకు మండుటెండల్లో సైతం డ్యూటీ చేస్తున్నారు.
శిల్పా సాహు విధులు నిర్వర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె.. కర్ర చేత పట్టుకుని వచ్చిపోయే వాహనదారులను నిలిపి కరోనా మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.