మైసూరులో జరిగిన కాంగ్రెస్ సభలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ముస్లిం మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సభలో ముందు వరుసలో కూర్చొన్న ఆ మహిళ... ఏదో మాట్లాడబోతుంటే... ఆమెను ఆపే ప్రయత్నంలో భాగంగా, చేతిలోని మైక్ లాక్కున్నారు. అపుడు సిద్ధరామయ్య చేతి వేళ్ళకు తగులుకుని చున్నీ జారిపోయింది.
అలాగే, ఆమె భుజాన్ని తాకి కింద కూర్పోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ నేతలు మహిళను గౌరవించడం లేదనీ, వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, ఆ సభలో మహిళా కార్యకర్త ప్రసంగాన్ని ఆపే ప్రయత్నంలో మైక్ లాక్కున్నానని చెప్పారు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిపోయిందని వివరించారు. 'ఆమె నాకు 15 ఏళ్లుగా తెలుసు. నాకు తను చెల్లెలి లాంటిది. నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు' అని చెప్పారు.