దేశ ప్రథమ పౌరురాలి పీఠంపై ఓ గిరిజన మహిళ కూర్చోనున్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె దేశ 15వ కొత్త రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అట్టడుగు స్ధాయి నుంచి దేశాధిపతిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన ద్రౌపది ముర్ము జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వాటిని ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటివరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ కూర్చోనున్నారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము తదుపరి రాష్ట్రపతిగా రైసినా హిల్ మెట్లెక్కబోతున్నారు.
పైగా, దేశంలో ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న రెండో మహిళ కూడా ఈమే. అంతకుముందు ప్రతిభా పాటిల్ తొలి మహిళా రాష్ట్రపతిగా ఘనత సాధించారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జన్మించిన ముర్ము.. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ మరో రికార్డు సృష్టించారు.
ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఈమే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.
ఒరిస్సాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ముర్ము ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఈ ప్రయాణం ఆమెకు నల్లేరు మీద నడకేం కాదు. ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.
ఝార్ఖండ్ సరిహద్దులోని పహర్ద్‌పూర్ గ్రామంలో 80శాతం సంతాల్ తెగ వారే ఉండేవారు. ఆ తెగకు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన ముర్ముకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తమ ఊరి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లి కాలేజీలో చదువుకున్న తొలి వ్యక్తి ఈమే అంటే అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన నెలకు రూ.10తోనే కాలేజీకి వెళ్లి చదువును పూర్తి చేసుకున్నారామే.
తొలుత ఆమె ప్రభుత్వ క్లర్క్‌గా తన వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టీచర్‌గానూ పనిచేశారు. 1997లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె రాయ్‌రంగ్‌పూర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికై.. మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గతేడాది ఆమె పదవీకాలం పూర్తవడంతో తిరిగి తమ స్వస్థలమైన రాయ్‌రంగ్‌పూర్ తిరిగొచ్చారు. ఈ పట్టణంలో తన భర్త కట్టించిన ఐదు గదుల ఇంట్లోనే అప్పటి నుంచి ఉంటున్నారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఆమె నిరాడంబరతే ప్రజలకు చేరువచేసింది.
ముర్ము వ్యక్తిగత జీవితంలో పూడ్చలేని విషాదాలు మూడుసార్లు ఎదురయ్యాయి. వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరవైల్లో ఉన్న తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త శ్యామ్ చరణ్ కన్నుమూశారు. ప్రస్తుతం ముర్ముకు కుమార్తె ఇతిశ్రీ ఉన్నారు. భర్త శ్యామ్ చరణ్, కొడుకులు లక్మన్, షిపున్ పేరు మీద ముర్ము.. ఎస్‌ఎల్‌ఎస్ మెమోరియల్ స్కూల్‌ను నిర్మించారు.
ముర్ము రాజకీయ ప్రస్థానం
1997: భాజపాలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్ కౌన్సిలర్, వైస్ ఛైర్మన్‌గా ఎన్నిక
2000: రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా ఎన్నిక
2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వం)
2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి
2004: రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక
2002-2009: మయూర్‌భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలు
2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు
2010: మయూర్‌భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలు
2013-2015: మయూర్‌భంజ్ జిల్లా భాజపా అధ్యక్షురాలు
2015: ఝార్ఖండ్ గవర్నర్‌గా నియామకం