కరోనా మహమ్మారి మానవత్వాన్ని మంటగలిపేస్తోంది. కళ్లెదుటే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నా చూస్తూ ఉండటమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. చికిత్స చేయిద్దమంటే బెడ్డు దొరకడం లేదు. సరే ఏదో ఒకటి చేసి బెడ్డు సంపాదించామంటే.. ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉండటం లేదు. ప్రాణవాయువు కోసం బాధితుల బంధువులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు. పెద్ద పెద్ద నాయకులకు, బడా వ్యాపారవేత్తలకే ఆస్పత్రిలో చోటు దక్కడం లేదంటే ఇక సామాన్యుడి గురించి చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితే ఎదురైంది గుడ్‌గావ్‌కు చెందిన విశాల్ సింగ్‌కు. 80 ఏళ్ల వాళ్ల నాన్నకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చేర్పిద్దామంటే ఎక్కడా ఖాళీ లేదు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని గ్రహించి ఏం చేశారో తెలుసా?
విశాల్ సింగ్.. దిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఇండస్ వ్యాలీ పబ్లిక్‌స్కూల్ అధినేత. మరో రెండు దిల్లీ పబ్లిక్ స్కూళ్లనూ నడుపుతున్నారు. సహారా గ్రేస్‌లోని సెక్టార్ 28లో నివాసం ఉంటున్నారు. వాళ్ల నాన్నకు ఇటీవల కరోనా సోకింది. వయోభారం కారణంగా పరిస్థితి కాస్తా విషమించింది. దిల్లీలోని దాదాపు అన్ని ఆస్పత్రులకు తిప్పారు. ఎక్కడా బెడ్లు దొరకలేదు. తమకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించారు. అయినా లాభం లేకపోయింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసే కంటే ఇంటి వద్దే వైద్యమందిస్తే ఫలితముంటుందనుకున్నాడు.
కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి, ఇంట్లోనే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి విశాల్ సింగ్‌ను కదిలించింది. కాస్త స్థోమత ఉన్న తమకే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనుకున్నాడు. విశాల్ నివాసముండే హౌసింగ్ కమ్యూనిటీలో దాదాపు 200 వరకు ఇళ్లుంటాయి. అందులో 60 మందికి కరోనా సోకినట్లు తెలుసుకున్నాడు. దాదాపు అందరిదీ అదే పరిస్థితి బెడ్లు దొరకడం లేదు, ఒక వేళ దొరికినా ఆక్సిజన్ కొరత.
ఒక్కరోజులోనే..
వీరందరికీ సాయం చేసేందుకు తానే ఒక కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ఆ హౌసింగ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఆర్మీ అధికారి జనరల్ వీకే నారులా, రిటైర్డ్ డాక్టర్ నాగ్రాలను సంప్రదించాడు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. తన అపార్టుమెంటును ఖాళీ చేసి ఇస్తానని కూడా చెప్పాడు. దీంతో వారిద్దరు కూడా ముందుకొచ్చారు.
కావాల్సిన ఏర్పాట్లన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేశారు. కొవిడ్ కేర్ ఫెసిలిటీ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, బెడ్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు ఇలా అన్నీ సమకూర్చుకున్నారు. తాము కొనుగోలు చేసిన సామగ్రితో అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించేందుకు వీలుగా 5 బెడ్లును సిద్ధం చేశారు. వీటన్నిటికీ దాదాపు రూ.20 లక్షలకు పైగా ఖర్చయిందట.
ఇది ఆస్పత్రి కాదు
కొవిడ్ కేర్ ఫెసిటిలీ సెంటర్‌లో చేరిన వారికి అక్కడే పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఇద్దరు అనుభవజ్ఞులైన నర్సులతోపాటు, బయటి నుంచి ఏవైనా తెచ్చేందుకు ఇంకొకరు వారికి నిత్యం అందుబాటులో ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, బీపీ, ఆస్తమా లాంటి వ్యాధులు ఉన్న వారు సంబంధిత డాక్టర్లను సంప్రదించి వారే మందులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఆస్పత్రి కాదు. కేవలం రిలీఫ్ సెంటర్ మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందించడంతోపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నామన్న భరోసా కల్పించడం కోసమే దీనిని ఏర్పాటు చేశామని విశాల్ అంటున్నారు.
అందర్నీ చేర్చుకోరు..
ఏప్రిల్ 24 ఉదయం 9 గంటలకు కేర్ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించగా 10 గంటలకు తొలి బాధితుడొకరు వచ్చారు. ఆరోగ్యం విషమంగా ఉన్న ముగ్గురు ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నారు. మరో రెండు బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకునే అవకాశం ఉన్న వారిని, ఆక్సిజన్ లెవెన్స్ సాధారణంగా ఉండేవారిని ఇందులో చేర్చుకోరు. ఆక్సిజన్ స్థాయులు 90 శాతం కంటే తక్కువ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లు కాస్త కోలుకున్న తర్వాత డిశ్ఛార్జి చేసి కొత్తవారిని చేర్చుకుంటున్నారు. ఇది ఆస్పత్రి కాదని, రిలీఫ్ సెంటర్ మాత్రమేనని, అయితే ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బంది పడేవాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని విశాల్ చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో ఇలా చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, కొంతమందికైనా సాయం చేయగలగుతున్నానన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందని విశాల్ అంటున్నారు.