చైనా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఈ వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్ నగర వీధులన్నీ ఇపుడు బోసిపోయివున్నాయి. పైగా, ఈ నగరంతో పాటు చైనాలోని పలు ప్రాంతాలు కరోనా వైరస్ భయంతో వణికిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి ఏదైనా పార్శిల్ వస్తే తీసుకోవాలా? లేదా? అనే సందేహం ఉత్పన్నమవుతోంది. ఈ సందేహాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివృత్తి చేసింది. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది.
చైనా నుంచి ఎవరికైనా లెటర్ పంపినా లేక పార్సిల్ చేసినా.. వాటిని స్వీకరించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. వస్తువులు, లెటర్లు, ప్యాకేజీలపై కరోనా వైరస్ బ్రతికి ఉండదని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయ్యినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఇంట్లో ఉండే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల వల్ల కరోనా వ్యాప్తికాదని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కానీ ఆ జంతువులను తాకిన తర్వాత.. చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం ఉత్తమం అని సూచన చేసింది.
న్యుమోనియా వాక్సిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, ఇన్‌ఫ్లూయెంజా టైప్ బి వ్యాక్సిన్ వేసుకున్నా.. దానితో కరోనాను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. సెలైన్ నీటితో తరుచూ ముక్కును శుభ్రం చేసినా ఫలితం ఉండదని తెలిపింది. మౌత్‌వాష్‌లతోనూ కరోనా సోకకుండా చేయలేమన్నది. యాంటీబ్యాక్టీరియల్ మందులు కూడా వైరస్ నియంత్రణకు పనిచేయవు. ఇప్పటివరకు కరోనా వైరస్ చికిత్సకు నిర్దిష్టమైన మందులేదని ఆరోగ్య సంస్థ స్పష్టత ఇచ్చింది. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధల ద్వారా ఈ వైరస్ బారినపడకుండా ఉండొచ్చని పేర్కొంది.