కరోనా వైరస్ విముక్త భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ జనతా కర్ఫ్యూకు ఎవరూ ఊహించని విశేష స్పందన కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అయితే, అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. జనతా కర్ఫ్యూను దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటిస్తూ ఇళ్లలోనే ఉండడంతో దేశం మొత్తం పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా మారిపోయింది.
రాజస్థాన్ రికార్డు
రాజస్థాన్ రికార్డులకెక్కింది. కరోనా వైరస్ కారణంగా పూర్తి నిర్బంధంలోకి వెళ్లిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ నెల 31 వరకు రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ప్రకటించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
సీఎం ఆదేశాలతో శనివారం అర్థరాత్రి నుంచే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర సేవలు తప్ప మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు అన్నీ మూతపడ్డాయి.
షట్‌డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా ఆహార పొట్లాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అర్హులందరికీ ఉచితంగా గోధుమలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
రాజస్థాన్‌లో శనివారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల మొత్తం సంఖ్య 23కు పెరిగింది. కరోనా బాధితుల్లో నాలుగున్నరేళ్ల బాలిక ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.