Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ అప్‌డేట్: దేశవ్యాప్తంగా మొదలైన జనతా కర్ఫ్యూ.. 315కు చేరిన వైరస్ కేసులు

కరోనావైరస్ అప్‌డేట్: దేశవ్యాప్తంగా మొదలైన జనతా కర్ఫ్యూ.. 315కు చేరిన వైరస్ కేసులు
, ఆదివారం, 22 మార్చి 2020 (09:31 IST)
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 169 దేశాలకు విస్తరించింది. 2,75,000 మందికి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 11,000 దాటింది. దాదాపు 90,000 మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

 
ఇటలీలో ఒకే రోజు 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ దేశంలో ఇప్పటివరకూ కోవిడ్-19తో 4,032 మంది చనిపోయారు. స్పెయిన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఒకేరోజు ఇక్కడ 300 మరణాలు రికార్డు అయ్యాయి. మొత్తంగా ఆ దేశంలో ఇప్పటివరకు 1,326 మంది చనిపోయారు.

 
భారతదేశంలో కోవిడ్-19 వ్యాధి సోకిన వారి సంఖ్య 315కి చేరుకుంది. ఇప్పటివరకు 23 మంది చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నలుగురు వ్యక్తులు చనిపోయారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 8 గంటల వరకూ... విదేశాల నుంచి వచ్చిన 12953 మందిని గుర్తించారు. వీరిలో 2052 మంది 28 రోజుల నిర్బంధ లేదా ప్రత్యేక పర్యవేక్షణను పూర్తిచేసుకున్నారు. 10841 మంది ఇళ్ల వద్దే క్వారంటైన్ అయ్యారు. 60 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

 
160 మంది నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. 130మందికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణైంది. మరో 25మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 'ది ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020'ని ప్రభుత్వం విడుదల చేసింది.

 
ప్రారంభమైన జనతా కర్ఫ్యూ
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

 
మెట్రో రైలు సేవలను కూడా నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని కార్యాలయాలు మూసివేశారు. రాత్రి 10 గంటల వరకూ అన్ని ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కూడా ఖాళీగా మారాయి. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 315 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

 
ఆంధ్రప్రదేశ్‌లో 2 కొత్త కేసులు
కృష్ణా జిల్లాలో ఒకరికి, తూర్పు గోదావరిలో మరొకరికి కరోనావైరస్ సోకినట్లు నిర్థరించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి దిల్లీ, హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. మరొకరు లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి రాజమండ్రికి చేరుకున్నారు.

 
'ఎక్కడి వారు అక్కడే ఉండండి' - మోదీ
'ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని, ఎక్కడి వారు అక్కడే ఉండాలి' అని ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు ఒక రోజు ముందు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. "మీరంతా ఇప్పుడు ఏ నగరంలో ఉన్నారో కొద్ది రోజులు అక్కడే ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బస్టాండులు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారడం వల్ల ప్రజారోగ్యం గందరగోళంలో పడుతుంది. దయచేసి మీరు, మీ కుటుంబ సభ్యులు అవసరం లేనిదే ఇంటిని వదలి వెళ్ళవద్దు" అని ప్రధాని సూచించారు.

 
తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020 విడుదల
తెలంగాణలో 22 మందికి ఈ వ్యాధి నిర్థరణ అయింది. అయితే, శనివారం మొదటిసారిగా ఒక స్థానికుడికి కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. పేషెంట్ నంబర్ 14తో కలిసిన ఒక వ్యక్తికి కరోనా సోకిందని నిర్థరించారు. కోవిడ్ వ్యాధికి గురైన వారిలో ఒకరు డిశ్చార్జి అయ్యారు.

 
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. 1897 నాటి ఎపిడమిక్ చట్టానికి లోబడి, 'తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020'ను విడుదల చేసింది.

 
కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వ సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. దీని ప్రకారం అనుమానితులపై స్వయంగా తమకు తామే ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి వచ్చింది.

 
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ జీవో-13 ప్రకారం వైద్య సంస్థలు, స్థానిక సంస్థలు, పోలీసులకు అదనపు అధికారాలు దక్కాయి. ప్రైవేటు ఆసుపత్రులపై కూడా పరీక్షలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా, సహకరించని వారిపై ఐపిసి-188 సెక్షన్ (ప్రభుత్వం ఆదేశాలకు పౌరులు బద్ధులై ఉండాలి) కింద కేసులు కూడా నమోదు చేయవచ్చు.

 
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, "ఇప్పటివరకు 11,,000 మందిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాం. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తాం. షట్ డౌన్ చేయడానికి కూడా సిద్ధమే" అని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేసులు మినహా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 64 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఒకరు చనిపోయారు. కేరళలో 43 మంది కోవిడ్-19తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ముగ్గురికి వ్యాధి నయం కావడంతో డిశ్చార్జి చేశారు.

 
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి సర్వే
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.

 
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఆస్పత్రుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 
విశాఖలో పాజిటివ్ కేసు వచ్చిన చోట, ఆ ఇంటి నుంచి ౩ కిమీ వరకూ జల్లెడ పట్టారు. మొత్తంగా 335 బృందాలు 25,950 ఇళ్లు సర్వే చేశాయి. ఆ ప్రాంతంలో మరెవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. కొన్ని జిల్లాల్లో అవగాహన కోసం స్వయం సహాయక బృందాల సేవలను వినియోగించుకుంటున్నారు. నెల్లూరు, ప్రకాశంలో జిల్లాలో పాజిటివ్ కేసుల నివాస స్థలం నుంచి ౩ కిమీ పరిధిలో సర్వే పూర్తి చేసి, అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచారు.

 
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఒంగోలులో సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయాన్ని తనిఖీ చేశారు. విదేశాల నుంచి 12,421 మంది ఆంధ్రకు వచ్చారనీ, వారిలో 7,000 మంది ఇప్పటికీ 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారని ఏపీ వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర రెడ్డి ప్రకటించారు. సంపర్క్ క్రాంతి రైలులో తొమ్మిది మంది ఏపీ వాళ్లున్నారనీ, వారిని ఐసోలేషన్లో ఉంచామని ఆయన చెప్పారు. ఇతర దేశాల వారికి విశాఖలో క్వారంటైన్ సౌకర్యం పెట్టినట్టూ, అసవరమైతే కాలేజీ హాస్టళ్లను కూడా వాడతామనీ ఆయన ప్రకటించారు.

 
తిరుమలలో భారీగా మిగిలిన లడ్డూలు
ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన శ్రీవారి లడ్డూలు తమ ప్రతి ఉద్యోగి కుటుంబానికి ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయించింది. కరోనావైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు నిలిపివేయడంతో లడ్డూలు భారీగా పేరుకుపోయాయి. వీటిని తమ ఉద్యోగులకు ఉచితంగా అందచేయాలని టీటీడీ నిర్ణయించుకుంది.

 
తిరుమల శ్రీవారి లడ్డూకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. దీనికి అదనంగా ఎన్నయినా కొనుక్కునే అవకాశం ఉంది.

 
భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలను తయారు చేసి నిల్వ ఉంచుతుంది. ఆలయం మూసివేతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది. తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం ఎప్పుడన్నది కచ్చితంగా తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉన్న నిల్వలను సిబ్బందికైనా పంచిపెడితే వారు సంతోషిస్తారని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

 
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనావైరస్ రోగులున్నారనే అనుమానంతో రైలును ఖాజీపేటలో నిలిపివేశారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు అనుమానిత రోగులను హైదరాబాద్ తరలించారు.

 
హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళ్తున్న ఈ రైలులో ఇద్దరు అనుమానిత కరోనావైరస్ రోగులను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఏప్రిల్ 5 వరకూ ఎక్కడికీ వెళ్లవద్దని వికారాబాద్‌లో డాక్టర్లు వేసిన ముద్ర వీరి చేతిపై ఉండటాన్ని గుర్తించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఖాజీపేటలో వీరిని దింపిన రైల్వే పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 
వారు ప్రయాణించిన బోగీలోని ప్రయాణికులను వేరే బోగీలోకి మార్చి, దాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. ప్రస్తుతం ఖాళీ బోగీతోనే రైలు దిల్లీకి బయలుదేరింది.

 
సింగపూర్‌ నుంచి 125 మంది తెలుగువారు విశాఖకు చేరుకున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో సింగపూర్ నుంచి నడిచే విమాన సర్వీసును కొద్ది రోజులుగా రద్దు చేశారు. కానీ, అక్కడ చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఓ ప్రత్యేక విమానం ద్వారా వారిని విశాఖ పట్నం ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. వీరికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడానికి ఆరుగురు వైద్యుల బృందం, అంబులెన్సులు విమానాశ్రయానికి చేరుకున్నాయి.

 
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటల వరకూ 1006 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరిలో 259 మంది 28 రోజుల నిర్బంధ లేదా ప్రత్యేక పర్యవేక్షణను పూర్తిచేసుకున్నారు. 711 మంది ఇళ్ల వద్దే క్వారంటైన్ అయ్యారు. 36 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

 
135మంది నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. 108మందికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణైంది. మరో 24మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.

 
తెలంగాణలో శుక్రవారం ముగ్గురికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్థరణ అయింది. దీంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు లండన్ నుంచి తిరిగి వచ్చిన మహిళ. ఇద్దరు దిల్లీ మీదుగా కరీంనగర్ వచ్చిన ఇండొనేషియా బృందంలోని సభ్యులు.

 
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యవసర సేవల విభాగాలు తప్ప అన్ని ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలను మూసి ఉంచారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని షాహీద్ మదన్ లాల్ ధింగ్రా బస్ స్టేషన్ నిర్మానుష్యంగా మారిపోయింది.

 
ప్రభుత్వోద్యోగులు రెండువారాల పాటు పార్ట్ టైమ్ పనిచేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఏర్పాటు అత్యవసర సేవల విభాగాలు తప్పించి మిగిలిన అన్ని విభాగాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం తెలిపారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 49 మంది కరోనావైరస్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, హైదరాబాద్‌లోని సీసీఎంబీని కరోనావైరస్ నిర్థరణ పరీక్షలకు ఉపయోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. విదేశాలకు వెళ్లి వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన భార్యను క్వారంటైన్లో ఉంచాలని జిల్లా వైద్యాధికారి ఆదేశించారు.

 
ఈనెలాఖరు వరకూ అన్ని సినిమా షూటింగులూ నిలిపివేస్తున్నట్లు తెలుగు పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. థియేటర్లు కూడా మూసి ఉంటాయని తెలిపింది.

 
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాలలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను విరమించుకోవాలని సూచించారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకోసం, మన సమాజం కోసం ఈ ఆదివారం ఇంట్లోనే ఉండండి: భారత ఉపరాష్ట్రపతి