దేశంలో ఐదో జనరేషన్ తరంగాల(5జీ) సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 5జీ స్పెక్ట్రమ్స్ వేలానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో 5జీ సేవలు ప్రజలకు వినియోగానికి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీంతో జూలై నెలాఖరు నాటికి ఈ 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవల వేగం ప్రస్తుతం ఉన్న వేగానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంటాయి.
దీనిపై కేంద్రం ఓ పత్రికా ప్రకటన చేసింది. "ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్యత అంశంగా ఉంది" అని పేర్కొంది.
ప్రస్తుతం ఇంటర్నెట్, ముబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రజల రోజువారీ జీవితాల్లో ఓ భాగమైపోయాయి. కాగా, దేశంలో గత 2015లో 4సీ సేవలు అందుబాటులోకి రాగా, ఈ సేవలు శరవేగంగా దేశంలో విస్తరించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలను పొందుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకు ఉంమది. 2014లో ఈ సంఖ్య 10 కోట్లుగానే ఉండేదని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది.