అతిలోక సుందరి శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన బాత్‌టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఆమెది సహజ మరణమేనని, గుండెపోటుతో ఆమె ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తాయి. కానీ ఆమెను హత్య చేశారనే వార్తలు అప్పట్లో పెను సంచలనమయ్యాయి.
అయితే, దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఆమె బాత్‌టబ్‌లో మునిగిపోవడం వల్లే మరణించిందని తేల్చి ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ ఆరోగ్యకరంగా వున్న ఓ వ్యక్తి బాత్‌టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఏంటనే ప్రశ్నలు ఇప్పటికీ అభిమానుల మదిని తొలిచేస్తున్నాయి.
తాజాగా, శ్రీదేవి మరణంపై సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. శ్రీదేవి మరణించలేదని, ఆమెను చంపేశారని, ఆమె మరణం వెనక కుట్ర కోణం దాగి ఉందని కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ దినపత్రికకు రాసిన వ్యాసంలో శ్రీదేవి మునిగి చనిపోయి ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఊరకనే ఏదో చెప్పాలని చెప్పలేదని.. ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో ఆ విషయం పంచుకున్నారని తెలిపారు. ఓ మనిషి ఎంత మద్యం తీసుకున్నా, ఎంతగా మత్తులో మునిగి తేలినా అడుగు లోతు ఉండే నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యమని తెలిపారు. శ్రీదేవి కాళ్లను ఒకరు గట్టిగా పట్టుకుంటే మరొకరు ఆమె తలను నీటిలో ముంచి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలా జరిగి ఉంటే తప్ప శ్రీదేవి చనిపోయే అవకాశం లేదని ఉమా దత్తన్ తనతో చెప్పారని.. అయితే, ఈయన ప్రస్తుతం మన మధ్య లేరని, ఇటీవలే మరణించారని తెలిపారు.
శ్రీదేవి మరణంపై వస్తున్న కుట్ర కోణం వార్తలను ఆమె భర్త బోనీ కపూర్ ఖండించారు. ఇవన్నీ ఊహాజనితమేనని కొట్టిపడేశారు. ఆధారాలు లేని ఇటువంటి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఇలాంటి మూర్ఖపు వాదనలను ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారని కొట్టిపారేశారు.