ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందనీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్.. ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్, పబ్లిక్ అఫైర్స్ వద్ద భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు-అవకాశాలు అన్న అంశంపై ప్రసంగించారు. భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ల హయాంలో దారుణంగా దిగజారిందని వ్యాఖ్యానించారు.
వీరిద్దరి కారణంగా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఆగమాగమైందని విరుచుకుపడ్డారు. చావుబతుకుల్లో ఉన్న బ్యాంకులకు తిరిగి ప్రాణంపోసే పనిలో ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందన్నారు. మన్మోహన్, రాజన్ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) ప్రమాదకర స్థాయికి చేరాయని, వాటిని పరిష్కరించే బాధ్యత తాము తీసుకున్నామన్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయాన్ని అందించామని గుర్తుచేశారు. అంతేగాక 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేశామని తెలిపారు. రాజన్ హయాంలో ఇష్టారాజ్యంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు.. పెద్ద ఎత్తున మొండి బకాయిలుగా పేరుకుపోయాయని మండిపడ్డారు.
ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని, కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని ఆయన భ్రష్ఠుపట్టించడం వల్లే ఇప్పుడీ దుస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, రాజన్‌ల హయానికి ముందు భారత బ్యాంకులు బలంగా ఉన్నాయనీ నొక్కిచెప్పారు.