పద్మశ్రీ డా. శోభారాజు గారితో శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అనుబంధం ప్రత్యేకమైనది. 1979వ సంవత్సరంలో శోభారాజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటి కళాకారిణిగా నియమించబడినపుడు, అన్నమయ్య జీవిత విశేషాలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని సంకల్పించి ఆయన జీవిత కథాంశాన్ని "అన్నమయ్య కథ" పేరిట స్వయంగా రచించి, సంగీత దర్శకత్వం వహించి ఒక సంగీత రూపకంగా రూపొందించారు.
అప్పుడు తను పాడకుండా అభిమాన గాయనీగాయకులైన బాలు, శ్రీమతి పి.సుశీలలచే పాడించారు. అలా మొదటిసారి బాలు గారు "విన్నపాలు వినవలె వింతవింతలు, సకలం హేసఖి జానామి, ఇందిరా రమణు తెచ్చి, నానాటి బ్రతుకు" వంటి కీర్తనలు ఆలపించారు. స్వయంగా బాలు గారు "నేను మొదటిసారి అన్నమయ్య కీర్తనలు పాడుతున్నాను" అని అన్నారట.
శోభారాజు గారు "బాలు అన్నయ్య ఎంతో భక్తిశ్రద్ధలతో నేర్చుకొని ఆలపించారు. ఆయనతో అన్నమయ్య కీర్తనలు పాడించే అవకాశం నాకు దక్కింది. అలాంటి గాయకుడు ఇక రారు కదా." అని బాలు గారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.