మండలికి మంగళం : ఏపీలో శాసనమండలి చరిత్ర ఇదీ...

సోమవారం, 27 జనవరి 2020 (17:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలికి మంగళంపాడారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్న అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు చేశారని విపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. కానీ, ప్రజా సంక్షేమం కోసం మండలిని రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మండలి చర్చ చరిత్రపై చర్చ మొదలైంది. 
 
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1958 సంవత్సరంలో ఆర్టికల్ 198 కింద తొలి శాసనమండలిని ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్రపతి  రాజేంద్రప్రసాద్ 1958 జులై 8 శాసన మండలిని అధికారికంగా ప్రారంభించారు. మండలి ఆవిర్భవించిన 27 యేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ 1983లో గెలుపొందిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985లో శాసన మండలి రద్దు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 
 
అప్పుడు మండలిలో మొత్తం 90 మంది సభ్యులు ఉండేవారు. తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆవిర్భవించడంతో మండలిలో టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహించే సభ్యుడు ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం, బిల్లులు ఆమోదం పొందడం ఆలస్యం కావడం, వీటితో పాటు మండలి వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఎన్టీఆర్‌ మండలి రద్దు చేయాలని నిర్ణయించారు. 
 
మండలి రద్దుతో  చాలామంది రాజకీయ నిరుద్యోగులయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మండలి పునరుద్ధరణకు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. 1990లో మండలి పునరద్ధరణ కోసం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. కానీ మండలి ఏర్పాటు సాధ్యపడలేదు. 
 
ఆ తర్వాత 2004లో మండలి పునరుద్ధరణకు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2004 జూలై 8న మండ‌లి పునరుద్ధరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. 2004 డిసెంబ‌ర్ 16న లోక్‌స‌భ‌లో ప్రవేశపెట్టగా 2006 డిసెంబ‌ర్ 15న బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. వెంట‌నే డిసెంబ‌ర్ 20న రాజ్యసభ కూడా బిల్లుకు ఆమోద‌ముద్ర వేసింది. 2007 జ‌న‌వ‌రి 10న రాష్ట్రప‌తి కూడా ఆమోద‌ముద్ర వేయ‌డంతో  కొత్తగా శాస‌న‌మండ‌లి 2007 మార్చి 30న అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ రామేశ్వ‌ర్ ఠాకూర్ ప్రారంభించారు. 
 
ఉమ్మ‌డి ఏపీలో మండ‌లి సభ్యుల సంఖ్య 90 మంది ఉండ‌గా.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీలో ఎమ్మెల్సీల సంఖ్య 58కి తగ్గిపోయింది. ఆరు సంవ‌త్స‌రాలు మండ‌లి స‌భ్యుల కాల‌ప‌రిమితి కాగా.. ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి మూడో వంతు స‌భ్యుల కాలప‌రిమితి ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త స‌భ్యుల‌ను ఎన్నుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ 58 మందిలో 8 మందిని గ‌వ‌ర్న‌ర్ నియ‌మిస్తారు. 40 మంది స‌భ్యుల‌ను శాస‌న‌స‌భ్యులు, స్థానిక సంస్థ‌ల నుంచి ఎన్నుకుంటారు. వీరిలో 10 మంది ఉపాధ్యాయ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌వుతారు. 
 
అయితే, 2019 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వైసీపీకి ఏపీ శాస‌నమండ‌లిలో మాత్రం 58 స్థానాల‌కుగాను కేవ‌లం 8 మంది మాత్ర‌మే ఉన్నారు. తెదేపాకు 31, పీడిఎఫ్‌కు 3, నామినేటెడ్ 8, బిజేపీ 2, స్వంతంత్రులు ఐదుగురు ఉన్నారు. మ‌రో స్థానం ఖాళీగా ఉంది. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులకు మండలి ఓ స్పీడ్ బ్రేకర్‌గా మారింది. ఈ స్పీడ్ బ్రేకర్లను అధికమించాలన్న ఏకైక లక్ష్యంతో ఇపుడు తన తండ్రి వైఎస్ఆర్ విశేష కృషి ఫలితంగా ఏర్పడిన శాసనమండలిని రద్దు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బడ్జెట్ 2020: బంగారం ధరలు అమాంతం పెరిగిపోతాయా?