Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం.. ఆళ్ళ నాని చర్చ... రాజధానిని మార్చడం లేదట...

Advertiesment
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం.. ఆళ్ళ నాని చర్చ... రాజధానిని మార్చడం లేదట...
, సోమవారం, 27 జనవరి 2020 (12:57 IST)
శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ తీర్మానంపై తొలుత రాష్ట్ర మంత్రి ఆళ్ళ నాని చర్చను ప్రారంభించారు. కొన్ని రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాగోలేవన్నారు. 
 
ముఖ్యంగా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా సొంత ప్రయోజనాలపైనే దృష్టిపెట్టి అసెంబ్లీ, శాసనమండలిలో టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతేకాకుండా, అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని.. సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణి వల్ల రాష్ట్రం విడిపోయిందన్నారు. 
 
విభజనతో హైదరాబాద్‌లాంటి మహానగరాన్ని కోల్పోయామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ అలుపెరగని పోరాటం చేశారని ఆళ్ల నాని వివరించారు. హోదా కోసం పోరాడిన వారిపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెప్పుకొచ్చారు. 
 
జగన్‌కు కులతత్వాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు కమీషన్లు దండుకుని పోలవరం నిర్మాణంపై దృష్టిపెట్టలేదన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్దదిడ్డమైన బిల్లులు ఆడ్డుకుంటే మండలిని రద్దు చేస్తారా? నారా లోకేశ్