గణతంత్ర వేడుకలు రోజు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో రైతులు పోలీసులను కర్రలతో చితక బాదారు. దీనితో వందలమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో 3 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనల నుండి రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ మరియు రైతు నాయకుడు సర్దార్ వి.ఎం సింగ్ మద్దతు ఉపసంహరించుకున్నారు.
నిరసనలో పాల్గొన్న మరో యూనియన్ కిసాన్ యూనియన్ కూడా బుధవారం తమ మద్దతును ఉపసంహరించుకుంది. ఆందోళనలో పాల్గొంటున్న రైతులు చిల్లా సరిహద్దు నుండి వైదొలగాలని ప్రకటించింది. రైతు నాయకుడు సర్దార్ వి.ఎం. సింగ్ మాట్లాడుతూ, "ఎవరో నిర్ణయించే దిశలో మేము నిరసనను సాగించలేము. నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఐతే నేను, రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంగథన్ నిరసన నుండి వైదొలగుతున్నాం. మేము ప్రజలను, అమరవీరులను కొట్టేందుకు ఢిల్లీ ఎర్రకోట వైపుకి రాలేదు" అని అన్నారు.
దీనితో భవిష్యత్తులో రైతుల నిరసన కార్యక్రమం బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంటుకి పాదయాత్ర ఏమేరకు నిర్వహించగలరోనన్న అనుమానం కూడా కలుగుతోంది.