రైల్వే జోన్ ఇవ్వలేం.. దానివల్ల ఏమొస్తుందయ్యా... కేంద్ర హోంశాఖ కార్యదర్శి
విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చిపారేశారు. పైగా, అసలు రైల్వే జోన్ వల్ల ఏమొస్తుంది? కొత్తగా ఓ జనరల్ మేనేజర్, మరొకొందరు ఉద్యోగులు తప్ప.. అన
విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తేల్చిపారేశారు. పైగా, అసలు రైల్వే జోన్ వల్ల ఏమొస్తుంది? కొత్తగా ఓ జనరల్ మేనేజర్, మరొకొందరు ఉద్యోగులు తప్ప.. అని తెగేసి చెప్పింది. అసలు రాష్ట్రానికి రైల్వే జోన్ కావాలో.. రైల్వే లైన్ కావాలో తేల్చుకోమని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ అధికారులు రైల్వే జోన్ గురించి ప్రస్తావించగా రాజీవ్ గాబా మాట్లాడుతూ ప్రత్యేక రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీలేదు. పైగా అసలు నవ్యాంధ్రకు రైల్వే జోన్ ఇవ్వలేమని తెగేసి చెప్పారు. అసలు రైల్వేజోన్‌తో ఏమొస్తుంది? ఒక జనరల్ మేనేజర్ కొత్తగా కూర్చుంటారు. మరికొందరు ఉద్యోగులు వస్తారంతే! అంటూ సెలవిచ్చారు. అంతేనా, మీకు రైల్వేజోన్ కావాలా? రైల్వే లైన్ కావాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో ఏపీ అధికారులు ఖంగుతిన్నారు.
అయినప్పటికీ ఏపీ అధికారులు తగ్గకపోవడంతో ఈ విషయంలో రాజకీయ నిర్ణయం అవసరమని, నెల రోజుల్లో కేంద్ర హోంమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబును కూడా పిలుద్దామంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు.